YSR Yantra seva scheme: వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 7న పంపిణీ చేయనున్నారు. గుంటూరులో జరిగే కార్యక్రమంలో ఆర్‌బీకే, క్లస్టర్ స్థాయిలోని యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లను అందిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే మెగా మేళాలో 5,262 రైతు సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల రాయితీని కూడా సీఎం విడుదల చేస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పథకం ద్వారా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రపరికరాలు లభిస్తాయని, చిన్న, సన్నకారు రైతులతోపాటు పెద్ద రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుందని వివరించింది.
‘రాష్ట్రంలో రూ.2,106 కోట్ల వ్యయంతో విత్తు నుంచి కోత వరకు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. ఆర్‌బీకే స్థాయిలోని 10,750 యంత్ర సేవా కేంద్రాలకు ఒక్కోదానిలో రూ.15 లక్షల విలువైన పరికరాలు సమకూరుస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లోని 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఒక్కోచోట రూ.25లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి అద్దె, సంప్రదించాల్సిన వారి వివరాలను రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శిస్తారు. యాంత్రీకరణలో భాగంగా దుక్కిదున్నే యంత్రాలు, దమ్ము, చదును చేసేవి, వరినాటు, నూర్పిడి, కోత, ఎరువులు, సస్యరక్షణ, కలుపుతీత తదితర పరికరాలు ఉంటాయి’ అని వివరించింది.