ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జులై నాటికి కొత్త టెక్నాలజీ రోడ్లు.. ఫిర్యాదు చేసిన 60 రోజుల్లో బాగు చేయాలి: సీఎం - full depth reclamation

CM JAGAN REVIEW ON ROADS: రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని యూనిట్​గా తీసుకుని రోడ్ల పనులు నాణ్యంగా చేపట్టాలని సీఎం నిర్దేశించారు. పలు జిల్లాల్లో రోడ్లు త్వరగా పాడవుతున్న దృష్ట్యా.. అక్కడ రోడ్లు త్వరగా పాడవకుండా ఉండేందుకు పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీని వాడాలని అధికారులను ఆదేశించారు.

CM JAGAN REVIEW ON ROADS
CM JAGAN REVIEW ON ROADS

By

Published : Jan 23, 2023, 8:43 PM IST

CM REVIEW ON ROADS : రోడ్లు భవనాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్ల పరిస్థితి.. వాటి మరమ్మతులపై అధికారులతో సీఎం చర్చించారు. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తిచేయాలని అధికారులను సీఎం నిర్దేశించారు. పలు జిల్లాల్లో రోడ్లు దారుణంగా తయారవుతోన్న వైనంపై సీఎం ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్‌.. ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదించగా.. దీనికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధానంలో ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్న సీఎం.. మొదటి దశలో వెయ్యి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో చేపట్టాలని నిర్దేశించారు.

వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కడప, బెంగళూరు రైల్వేలైనుపై దృష్టిపెట్టాలన్న సీఎం.. విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలోనూ ఈ వివరాలు ఉంచాలన్నారు. రోడ్లపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలని అధికారులకు సీఎం సూచించారు. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని ఆదేశించారు.

పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను సీఎం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. యాప్‌ ద్వారా ఫొటోలను అప్‌లోడ్‌ చేసే అవకాశం సహా కోఆర్డినేటర్స్​తో పాటుగా ఫిర్యాదు నమోదు చేయవచ్చన్నారు. దీనిపై కమాండ్‌ కంట్రోల్‌ రూం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన సీఎం.. ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో జరగాలన్న సీఎం.. పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని పౌరుడు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలన్నారు. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు.

యాప్‌ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలన్నారు. నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు అవే సమస్యలు ప్రతిసారి రావన్నారు. రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. రోడ్డు మరమ్మత్తులలో దీర్ఘకాలం నిలిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details