CM JAGAN MEETING WITH PARTY LEADERS : షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏరకంగానూ.. రాష్ట్రవ్యాప్త ప్రజాభీష్టానికి గీటురాయికాదన్న సీఎం.. తెలుగుదేశం.. వాపును చూసి బలుపు అనుకుంటోందని.. ఎద్దేవా చేశారు. ఏ ఒక్క MLAనీ తాను వదులుకోవాలనుకోవడం లేదని,. ఇదే సమయంలో 25 మంది పనితీరు మెరుగుపరుచుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి నిర్వహించిన.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో.. వైసీపీ అధినేత జగన్ ముందస్తు ఎన్నికల ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికలకు.. ఇంకా ఏడాది ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బటన్ నొక్కుతూ... నేరుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బును లబ్దిదారుల ఖాతాల్లో వేశామని.. వివరించారు. ఈ నాలుగేళ్లలో పేదరికం నిర్వచనం కూడా మార్చామని, రాష్ట్రంలో.. 87 శాతం ఇళ్లకు మంచి జరిగిందని సీఎం చెప్పుకొచ్చారు.
"25 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని అనుకోను. పనితీరులో వెనకబడిన ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోవాలి. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీ, క్యాడర్‌కు నష్టం. ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సగం సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం పూర్తైంది. మిగతా సగం కార్యక్రమం 5 నెలల్లో పూర్తిచేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇతర కార్యక్రమాలకు పార్టీపరంగా కార్యాచరణ. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం. క్యాడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రచారం ఉద్ధృతం చేయాలి"-సీఎం జగన్
ఆ ఫలితాలను రాష్ట్రమంతటికీ ఎలా ఆపాదిస్తాం: MLAలు.. నెలకు 25 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని.. సెప్టెంబర్ నాటికి గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈనెల 7 నుంచి "జగనన్నే మన భవిష్యత్తు" కార్యక్రమం చేపట్టాలని సూచించారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఈ నెల 13న.. 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలను.. రాష్ట్రమంతటికీ ఎలా ఆపాదిస్తామని జగన్ ప్రశ్నించారు.