CM Jagan Review on Floods in AP: రాష్ట్రంలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. క్యాంపు ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమీక్షించారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటమట్టం 49.60 అడుగులు ఉందన్న సీఎం.. రేపు గోదావరి నీటి మట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు ఉందని, ఇది రేపటికి సుమారు 16 లక్షలకు చేరుకుని.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారన్నారు.
ప్రవాహం పెరిగే అవకాశం దృష్ట్యా కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని ఆదేశించారు. అధికారులు మానవీయ కోణంలో సహాయంఅందించాలన్నారు. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలని నిర్దేశించారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి వసతులు కల్పించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులను తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి 2వేలు రూపాయలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే వారికి 1000 రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉండాలన్న సీఎం.. ఉదారంగా వ్యవహించాలన్నారు. కచ్చా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని వారిని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ఇంటి మరమ్మతుల కోసం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
AP CM Jagan Video Conference with collectors: కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణ చేయవద్దన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉదారంగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, సచివాలయ స్థాయిలోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయాల సిబ్బందితో పాటు, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న ముఖ్యమంత్రి.. అదే విధంగా ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. లంక గ్రామాల్లో జనరేటర్లు లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలని, తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరాల ఏర్పాటు చేయాలని, విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలలో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వరదల కారణంగా పాముకాట్లు లాంటి ఘటనలు జరిగితే.. వాటికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.