CM Jagan Review: రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గంజాయి,అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏజెన్సీలో గంజాయిని నివారిస్తూనే వారికి ఉపాధి మార్గాలు కల్పించాలన్నారు. వాణిజ్య పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష ఆదాయాలను సమకూర్చే శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రగతిపై ఆరా తీశారు. పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నసీఎం.. పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. అవగాహన పెంపు, అభ్యంతరాల పరిష్కారం ఎప్పటికప్పుడు జరిగితే.. చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఎక్సైజ్ శాఖపై సమీక్షించిన సీఎం గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. బెల్టుషాపుల తొలగింపు, పర్మిట్ రూమ్‌ల రద్దు వంటి నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. రేట్లు పెంచడం వల్ల మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఎస్‌ఈబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపైనా సీఎం ఆరా తీశారు. చేయూత, ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలని ఆదేశించారు. గంజాయి నివారణ చర్యలు చేస్తూనే.. ఉపాధి మార్గాలు కల్పించాలన్నారు. అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలివ్వాలని సీఎం ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ శాఖపై సమీక్ష జరిపిన సీఎం.. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. మైనింగ్ శాఖపై సమీక్షించిన సీఎం నాన్ ఆపరేషనల్ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని నిర్దేశించారు.
ఇవీ చదవండి: