CM Jagan Review on NITI Aayog: ఈనెల 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఆరోజు సమావేశానికి హాజరుకానున్న సీఎం జగన్.. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో చర్చించనున్న అంశాలపై అధికారులతో సమీక్షించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరాలని నిర్ణయించారు. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్ సమావేశంలో వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్ చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించే బోధనాసుపత్రుల్లో తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్ ల్యాబ్స్ తప్పనిసరిగా పెట్టాలని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చించారు.
మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలని సీఎం ఆదేశించారు. తల్లి గర్భం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్ చేయడానికి సులభతరం అవుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ ట్రాక్ చేయడం కూడా సులభతరం అవుతుందన్నారు.
దిశ యాప్ కింద చేపట్టిన కార్యక్రమాలనూ నీతి ఆయోగ్ సమావేశంలో వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. దాదాపు 30వేలకు పైగా ఇంటర్వెన్షన్స్ జరిగిన విషయాన్ని హైలెట్ చేయాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అది వరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు.