CM JAGAN REVIEW ON ANGANWADI: అంగన్‌వాడీ ద్వారా అందుతున్న పోషకాహారం, తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, అంగన్‌వాడీలకు సరఫరా చేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లు కలిపి దాదాపు 57వేలమందికి సెల్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టికాహారం, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సమగ్ర పర్యవేక్షణ కోసం అంగన్‌వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్వైజర్లకు సెల్‌ఫోన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్ఫెడ్కి అప్పగించాలని సీఎం నిర్ణయించి ఆదేశాలిచ్చారు. దీన్ని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు నుంచి గుడ్ల పంపిణీని యాప్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ జరపాలన్నారు. క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలన్నారు. అంగన్‌వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయం మాత్రమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత అందించేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుందన్నారు. అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.