JAGANANNAKU CHEBUDAM PROGRAM : ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా అమలు చేసేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, దానికి అధికారులంతా సన్నద్ధం కావాలని ఆయన ఆదేశించారు.
‘జగనన్నకు చెబుదాం’పై ఆయన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పందన డేటా ప్రకారం రెవెన్యూ, పంచాయతీరాజ్, హోం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభమయ్యాక కూడా వాటికి సంబంధించే అత్యధికంగా వినతులు వచ్చే అవకాశాలున్నాయని, ఆయా శాఖల విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతినీ పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు ప్రతి విభాగాధిపతి ట్రాక్ చేయాలని ఆదేశించారు. ‘ప్రజల నుంచి అందిన అర్జీలపై ప్రతివారం ఆడిట్ నిర్వహించి, నివేదికలు తీసుకోవాలి. వాటి ట్రాకింగ్, పర్యవేక్షణ సజావుగా జరుగుతోందో లేదో ప్రతివారం సమీక్షించాలి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్‌సెంటర్లను అనుసంధానించాలి.
వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారానికి ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతుల్ని పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలి’ అని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలోను ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమ పర్యవేక్షణ విభాగాలుండాలని, ఆ తర్వాత జిల్లా, మండల, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలోను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.