CM Jagan Photos on Anganwadi bags: ప్రజాధనాన్ని ప్రచారానికి వినియోగించుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. పబ్లిసిటీ కోసం ఆయన అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే కోడిగుడ్లనూ విడిచి పెట్టలేదు. అన్నింటా ఆయన బొమ్మ, నవరత్నాల ముద్ర, నీలం రంగు ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే. తాజాగా అంగన్వాడీకేంద్రాల్లో అమలు చేసే వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం మరో ప్రచారాస్త్రంగా మలచుకునేందుకు తెరతీశారు. ఈ పథకం పాతదే.. సరకులు ఇంటికి ఇవ్వడమూ ఇదే తొలిసారి కాదు. పంపిణీ చేసేవీ కొత్తవి కాదు. కానీ సరికొత్త ప్రచార ఎత్తుగడలో భాగంగా దీన్ని ఏకంగా జగన్ ప్రచార పథకంగా మార్చేందుకు నిర్ణయించారు.
- ALSO READ:విశ్వవిద్యాలయాల అభివద్ధిపై జగన్ సమావేశం.. ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడాలంటూ డాంబికాలు
గర్భిణులు, బాలింతలకు జులై 1 నుంచి బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు తదితర సరకులు ఇంటికే ఇస్తామని జూన్‌లో ఉత్తర్వులిచ్చారు. సరకులను సంచుల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సంచిపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల ముద్ర ఉండేలా నమూనా రూపొందించారు. జిల్లాల వారీగా తయారీకి టెండర్లు పిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు లక్షలకు పైగా గర్భిణులు, బాలింతలు సేవలు పొందుతున్నారు. వీరికి ఇచ్చే ఒక్కో సంచి తయారీకి 40 రూపాయల చొప్పున 2కోట్ల 40 లక్షల వ్యయం కానుంది. జీఎస్టీ ఇతర ఖర్చులు కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ధర సరిపోదని గుత్తేదారులు అసంతృప్తిగా ఉన్నారు. కాగా సరకుల పంపిణీ ప్రక్రియ ఈ నెల 1వ తేదీకి బదులు తొలుత 15కి, తర్వాత 30వ తేదీకి వాయిదా పడింది.