CM Jagan Negligence on Smart Cities: స్మార్ట్ సిటీలపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. మాటల్లోని అభివృద్ధి చేతల్లో ఏది జగన్..? CM Jagan Negligence on Smart Cities: "ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. రహదారులు, కాలువల మరమ్మతులు, భూగర్భ నీటి వ్యవస్థ, వీధి దీపాలు వంటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి" ఈ విధంగా 2022 నవంబరు 25న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సమీక్షలు, ప్రసంగాల్లో ఊదరగొడుతున్న ముఖ్యమంత్రికి.. క్షేత్రస్థాయి అమలులో మాత్రం ఆ చిత్తశుద్ధి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు స్మార్ట్ సిటీల్లోనూ ఏడేళ్ల కిందట ప్రారంభమైన కొన్ని ప్రాజెక్టుల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం ఎలా లభిస్తుందని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు నిలదీస్తున్నారు.
Smart Cities Works in AP: ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా..మడమ తిప్పినట్లే..!
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన స్మార్ట్ సిటీల తరహాలో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, ఏలూరు నగరాలను తీర్చిదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వంలో తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. కేంద్రం ఎంపిక చేసిన అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీల్లోనూ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకించి అమరావతి స్మార్ట్ సిటీలో గత ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న 21 ప్రాజెక్టుల్లో 10 పక్కన పెట్టింది. మిగిలిన 11 ప్రాజెక్టుల పనులు కూడా 100 శాతం పూర్తి చేయలేదు. తిరుపతిలో అయిదేళ్ల కిందట ప్రారంభించిన పైవంతెన వారధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
విశాఖపట్నం, కాకినాడలోనూ కొన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదు. స్మార్ట్‌సిటీల అభివృద్ధికి తన వాటాగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందనే విమర్శలున్నాయి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఆధునిక సాంకేతిక వ్యవస్థను పౌరసేవల్లోనూ అనుసంధానించేలా స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రంలో నాలుగు నగరాలే ఎంపికయ్యాయి.
Amaravati Smart City Project: అమరావతి స్మార్ట్ సిటీకి జగన్ సర్కార్ తూట్లు.. నాలుగు ప్రాజెక్టులు రద్దు
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో ఆరు నగరాలను ఎంపిక చేసి ఒక్కో దానిలో సుమారు వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలని టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి ఏలూరు నగరాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అభివృద్ధి చేసేందుకు అప్పట్లో టెండర్లు పిలిచారు. నగర అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు.
గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలోని ఆరు స్మార్ట్‌సిటీలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే అనేక ప్రయోజనాలు చేకూరేవి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో పెరిగే వాహనాల సంఖ్య మేరకు రహదారుల విస్తరణ, కొత్తగా మాస్టర్‌ప్లాన్ రోడ్లు, అవసరమైన చోట పైవంతెనల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత నగరాల్లో పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించాలని ప్రణాళికను రూపొందించారు.
నెరవేరని తిరుపతి వాసుల కల.. అటకెక్కిన భూగర్భ విద్యుత్ తీగల పనులు
విపత్తులు సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని వీధుల్లోనూ మైక్ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదించారు.స్మార్ట్ సిటీల్లో నగరపాలక సంస్థల నుంచి అందించే పౌరసేవల్లోనూ ఆధునిక సాంకేతికతను అనుసంధానించేలా ప్రతిపాదించారు. ప్రజల చిరునామా సులువుగా తెలుసుకునేలా డిజిటల్ డోర్ నంబర్లు తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ మోడల్ డివిజన్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రాజధాని అమరావతి పనులు పక్కన పెట్టినట్లే.. మెట్రోరైలు ప్రాజెక్టుల ప్రతిపాదనని అటకెక్కించినట్లే.. ఆరు స్మార్ట్ సిటీల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కూడా జగన్ ప్రభుత్వం తొక్కి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు స్మార్టిసిటీల పనుల పురోగతిపైనా గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రత్యేకంగా సమీక్షలు జరపలేదు. పనుల పూర్తి చేయాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గడువు 2023 జులైతో ముగిసినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
అప్పుడు రాజధాని.. ఇప్పుడు స్మార్ట్‌సిటీ.. అమరావతిపై ప్రభుత్వానికి ఎందుకంత అక్కసు?