CM REVIEW ON KHARIF PADDY PROCUREMENT : ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. దీనికోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు. ఈ కొత్తవిధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
అత్యంత పారదర్శకంగా చెల్లింపులు ఉండాలి: ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందుగానే గోనె సంచులు అందుబాటులోకి తీసుకురావాలని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా, లేబర్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలన్న సీఎం.. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలన్నారు. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలన్నారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియజెప్పాలన్నారు.
ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల చెల్లింపుల్లో అత్యంత పారదర్శకత తీసుకువచ్చినట్టు అవుతుందన్నారు. ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్ సమస్యల వల్ల అక్కడక్కడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న సీఎం... ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని, సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలన్నారు.