ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Meeting With VCs: విశ్వవిద్యాలయాల అభివద్ధి​పై జగన్ సమావేశం.. ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడాలంటూ డాంబికాలు - ఏపీ తాజా వార్తలు

CM Jagan Meeting With VCs: కత్తిలేకుండా.. యుద్ధం చేయడం సాధ్యమేనా? పుస్తకాలు లేకుండా పరీక్షలకు సన్నద్ధమవడం జరిగే పనేనా? విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఉపన్యాసం వింటే అలాంటి సందేహాలే వస్తున్నాయి.! పాఠాలు చెప్పేవారు లేకపోయినా ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విధానాలు పాటించాలనడం ఎలా సాధ్యమో వీసీలకు అంతుచిక్కడం లేదు. నాలుగేళ్లు యూనివర్సిటీలను గాలికొదిలేసిన జగన్‌ ఉన్నత విద్యను ఉద్ధరించబోతున్నట్లు చివరి ఏడాదిలో సూచనలు చేయడం విస్తుగొలుపుతోంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 14, 2023, 10:56 AM IST

CM Jagan Meeting With VCs : విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలు మార్చేసి, నాలుగేళ్లూ చోద్యం చూసిన సీఎం జగన్‌.. ఉన్నట్టుండి ఉపకులపతుల సమావేశం పెట్టారు. ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడాలంటూ పాఠాలు చెప్పారు. కృత్రిమ మేథ, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటేషన్‌ రియాలిటీలంటూ స్పీచ్‌ దంచేశారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కనీసం పాఠాలు చెప్పేరు లేరు లేకుండా అవన్నీ సాధ్యమేనా? వర్సిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, విధానాలు అవలంబించాలంటే జరిగే పనేనా ? ఉపకులపతుల సమావేశంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తింది.

మన జగనన్న చెప్పిన విద్యాపరివర్తన పాఠం.. వినడానికి బాగానే ఉంది. కానీ వాస్తవమే విరుద్ధంగా కనిపిస్తోంది. మన యూనివర్సిటీల స్థాయి పెంచాలని ఇప్పుడు తాపత్రయపడుతున్న సీఎం జగన్.. నాలుగేళ్లుగా ఒక్క అధ్యాపక పోస్టూ ఎందుకు భర్తీ చేయలేదు? వైసీపీ భజనపరుల్ని వీసీలుగా, వర్సిటీల పాలకవర్గ సభ్యులుగా నియమించి, పిల్లల చదువులతో చెలగాటం ఆడిందెవరు? వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా, రివర్స్‌లో వర్సిటీలకు చెందిన 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌కు డిపాజిట్‌ చేయించుకుంటే వర్సిటీల లక్ష్యాలు ఎలా నెరవేరుతాయనేది అంతుచిక్కడం లేదు.

ఏఐ డిమాండ్‌ను అందుకోవాలంటే ప్రభుత్వ కళాశాలల్లో ఆ కోర్సులు ప్రవేశ పెట్టాలి కదా? నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఉండాలి కదా? JNTU కాకినాడలో 258 మంది అధ్యాపకులు కావాల్సి ఉంటే అక్కడ 139మంది మాత్రమే పని చేస్తున్నారు. గతంలో JNTU కాకినాడలో ప్రవేశాలకు ఎంతో డిమాండ్‌ ఉండగా ఇప్పుడు ర్యాంకర్లు కూడా కౌన్సిలింగ్‌లో ఐచ్ఛికాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో పని చేసే సామర్థ్యం ఉన్న వారు 70 శాతం ఉన్నారని జగన్‌ సెలవిచ్చారు. ఇంకోవైపు రాష్ట్రంలో చదువుకున్న వారిలో 35.14 శాతం నిరుద్యోగిత ఉన్నట్లు ఇటీవల ఓ సంస్థ సర్వేలో తేలింది. మరి యువశక్తిని ఎక్కడ వినియోగించుకుంటున్నాం. పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్నవాటిని సాగనంపుతుంటే, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ నైపుణ్యాలు విద్యార్థులకు ఎలా అందుతాయి?

ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ రేంజ్‌లో మన బోధనా విధానాలు ఎందుకు ఉండవు అని ప్రశ్నించారు జగన్‌! రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో.. 71 శాతం పోస్టులు ఖాళీగా పెట్టి.. జగన్ ఈ ప్రశ్న అడగడం ఆశ్చర్యమే! నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ NIRFర్యాంకుల్లోనే మన వర్సిటీలు నిలబడలేకపోతున్నాయి. 2019లో ఓవరాల్‌ ర్యాంకుల్లో 29వ స్థానంలో ఉన్న ఆంధ్ర వర్సిటీ ఈ ఏడాది 76వ స్థానానికి దిగజారింది. శ్రీవేంకటేశ్వర వర్సిటీ 72నుంచి 101-150 మధ్యకు పడిపోయింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిస్థితి ఇలా ఉంటే ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌తో ఎలా పోటీ పడగలమో ముఖ్యమంత్రే చెప్పాలి. వైసీపీ సేవలో తరించే వారిని వీసీలుగా పెట్టుకుని, గ్లోబల్‌ విద్యార్థుల్ని తయారు చేయాలంటే ఎలాగో, జగన్‌కే తెలియాలని విద్యావేత్తలు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details