ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రులకు సీఎం జగన్​ వార్నింగ్​.. ఇద్దరు లేదా ముగ్గురికి "ఉద్వాసన"! - ministers after cabinet meeting

JAGAN MEETING WITH MINISTERS : మంత్రుల్లో ఇద్దరు లేదా ముగ్గురికి ఉద్వాసన తప్పదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంచేశారు. పనితీరు ఆధారంగా రెండు మూడు టికెట్లు ఎగిరిపోతాయంటూ మంత్రివర్గ సమావేశంలో తేల్చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి గట్టిగా జవాబు చెప్పాలని అమాత్యులకు ఆదేశాలిచ్చారు. జులైలో విశాఖకు వెళతామన్న సీఎం.. ఎమ్మెల్యేలు, IASలు, న్యాయమూర్తులకు అక్కడే స్థలాలు ఇస్తామని అన్నట్లు తెలుస్తోంది.

CM MEETING WITH MINISTERS
CM MEETING WITH MINISTERS

By

Published : Mar 15, 2023, 8:47 AM IST

మంత్రులకు సీఎం జగన్​ వార్నింగ్​.. ఇద్దరు లేదా ముగ్గురికి "ఉద్వాసన"!

CM MEETING WITH MINISTERS : మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్​ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం తర్వాత కొద్దిసేపు మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం.. పనితీరును బేరీజు వేసుకుని మార్పులు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సారి రెండు, మూడు టికెట్లు ఎగిరిపోతాయని హెచ్చరించినట్టు సమాచారం. మంత్రులంతా పనితీరు మెరుగు పరుచుకోవాలని, అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించాలని నిర్దేశించారు.

చర్చల్లో చురుగ్గా స్పందించాలని.. ప్రతి ఒక్కరి పనితీరుపై ఆడిట్‌ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి సందర్భం లేకుండానే అనూహ్యంగా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రులు అవాక్కైనట్లు తెలిసింది. సీఎం ముందుగానే ఒక నిర్ణయానికి రావడం వల్లే ఇలాంటి హెచ్చరిక చేశారని.. సమావేశం తర్వాత అనధికారిక చర్చల్లో కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు.

ఆ ముగ్గురి ప్లేసులో.. ఈ ముగ్గురు: దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజును తొలగించి.. వారి స్థానంలో తోట త్రిమూర్తులు, కొడాలి నాని, కవురు శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తర్వాత ముహూర్తం ఉంటుందని భావిస్తున్నారు. మహిళా మంత్రులు విడదల రజిని, ఉషశ్రీ చరణ్‌ను కూడా తొలగిస్తారని ఊహాగానాలు వచ్చాయి. బాగా పనిచేస్తున్న వారి జాబితాలో ఇటీవలే మహిళా మంత్రుల పేర్లు ప్రకటించి.. ఇప్పటికిప్పుడు తప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అయితే ఆ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది.

ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని మంత్రుల వద్ద సీఎం జగన్​ ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాగానే పని చేసినట్లు నివేదికలు అందాయని.. అన్నీ తామే గెలుస్తున్నామని అన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత కూడా మంత్రులదేనని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ పోలింగ్​కు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలి: పోలింగ్‌ సమయంలో పార్టీ అభ్యర్థులకు సక్రమంగా ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉగాది సందర్భంగా 21, 22 తేదీల్లో శాసనసభకు సెలవు ఇచ్చినందున.. 23న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని మంత్రులకు చెప్పారు. ఎవరైనా రాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, అందరూ వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులదే అని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి వారం పాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యాన ఆసరా వారోత్సవాలు నిర్వహించాలని సీఎం సూచించారు.

జులైలో విశాఖకు: జులైలో విశాఖపట్నానికి వెళుతున్నామని.. అప్పటికల్లా అన్నీ కుదురుకుంటాయని మంత్రులతో సీఎం అన్నారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు విజయవంతమైందని సీఎంను అభినందిస్తూ మంత్రి వర్గ సభ్యులు తీర్మానం చేసిన సందర్భంగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల విషయాన్ని మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తావించగా.. విశాఖలో ఇద్దామని సీఎం చెప్పినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, న్యాయమూర్తులకు విశాఖలో ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, న్యాయమూర్తులకు విశాఖలో ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఎవరైనా పెట్టుబడిదారులు అక్కడ ఉంటామంటే వారికీ స్థలాలు ఇస్తామని అన్నట్లు సమాచారం. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సులకు సంబంధించి 15 లక్షల కార్డుల పంపిణీ ఆగిపోయిందని.. 30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పంపిణీ చేయగలమని రవాణాశాఖ మంత్రి విశ్వరూప్‌ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. 30 కోట్లయితే పెద్ద విషయమేమీ కాదు కదా చేయండని సీఎం అనగా.. సాంకేతిక కారణాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఏదో చెప్పబోయినట్లు తెలిసింది. వెంటనే కల్పించుకున్న సీఎం.. చేసేయండి.. విశ్వరూప్‌ సమన్వయం చేస్తారని అన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details