YSR Yantra Seva Scheme: రైతు భరోసా కేంద్రాల ద్వారా నచ్చిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీ ధరలకే స్వేచ్ఛగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని రైతు సంఘాలకు కల్పిస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వాటిని తక్కువ ధరలకే అద్దెకు తీసుకొని అవసరాలు తీర్చుకోవచ్చని చెప్పారు. మంగళవారం గుంటూరులో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ మేళాలో ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. 5,260 రైతు సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల రాయితీని జమ చేశారు.
గత ప్రభుత్వంలో ట్రాక్టర్ల డీలర్లతో ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు కుమ్మక్కై కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘మేం తెచ్చిన వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకంలో అవినీతికి తావు లేదని.. సీఎం అన్నారు. రైతు సంఘాలు నచ్చిన నమూనా, పరికరాలను ఆర్బీకేల ద్వారా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇందుకు రైతు సంఘాలు 10% సొమ్ము చెల్లించాలి. ప్రభుత్వం 40% రాయితీ ఇస్తుంది. మిగిలిన 50% రుణాన్ని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే ఇప్పించే ఏర్పాట్లు ఉన్నాయి.
రైతుసంఘం ఆర్డర్ చేయగానే యంత్రాలను డెలివరీ ఇచ్చేలా ఆర్బీకేలను తీర్చిదిద్దాం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,780 ఆర్బీకేలకు, మరో 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలకు రూ.700 కోట్ల విలువైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశాం. ఈ ఏడాదిలోనే రూ.2016 కోట్లతో మరిన్ని పరికరాలను రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం’ అని వివరించారు.
ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతు సంఘాలకు 1,204 ట్రాక్టర్లు, 75 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీని గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. రైతులు వాటిని తమ ప్రాంతాలకు స్వయంగా నడుపుకొంటూ తీసుకెళ్లారు. వాహనాలన్నీ సభా ప్రాంగణం నుంచి వెళ్లేవరకు ముఖ్యమంత్రి వేదిక పైనుంచి అభివాదం చేశారు. సుమారు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగింది.
సీఎం నిల్చునే ఉండటంతో మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతోపాటు ఎండలో నిల్చున్నారు. హాజరైన రైతులు, ప్రజలు ఎండలతో తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేరుగ నాగార్జున, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పాల్గొన్నారు.