ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

cm jagan letter to pm modi : 'కోరినంత మంది ఐఏఎస్‌లను ఇస్తాం.. ఎవర్ని పంపాలో మేం నిర్ణయిస్తాం' - AP cm jagan letter to pm modi

cm jagan letter to pm modi
cm jagan letter to pm modi

By

Published : Jan 28, 2022, 8:58 PM IST

Updated : Jan 29, 2022, 11:49 AM IST

20:56 January 28

ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954 సవరణలకు మేం మద్దతిస్తున్నాం: ముఖ్యమంత్రి జగన్

వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్‌ అధికారుల్ని నియమించాలని ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. పాలనను సజావుగా, నిరాటంకంగా సాగించేందుకు కేంద్రం చేతిలో శక్తిమంతులు, సమర్థులైన అధికారులతో కూడిన బృందం ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారుల్ని కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్‌పై పిలిపించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ సర్వీసు నిబంధనల్ని సవరించాలన్న ప్రతిపాదనపై పునరాలోచించాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. కేంద్రం కోరినంతమంది ఐఏఎస్‌ అధికారుల్ని నిబంధనల ప్రకారం కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపేందుకు సిద్ధంగా ఉన్నామని... కానీ ఎవర్ని పంపించాలో నిర్ణయించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వానికే ఉంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఐఏఎస్‌ అధికారుల్ని తమ రాష్ట్ర కేడర్‌ నుంచి కేంద్ర సర్వీసుకు పంపకపోవడంతో, కేంద్రంలో ఐఏఎస్‌ అధికారుల కొరత ఏర్పడుతోంది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చినా లేకపోయినా కేంద్ర డిప్యూటేషన్‌ రిజర్వుకు నిర్దేశించిన సంఖ్యలో, ఎంపిక చేసుకున్న ఐఏఎస్‌ అధికారులను తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తూ నిబంధనల్ని సవరించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. దానిపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దానికి స్పందనగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానికి లేఖ రాశారు.

ఉన్నపళంగా తీసుకుంటే ఇబ్బంది

‘కేంద్రప్రభుత్వ విభాగాలు సమర్థులైన అధికారుల సారథ్యంలో పనిచేస్తే రాష్ట్రాలకు చాలా మేలు జరుగుతుంది. రాష్ట్ర కేడర్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారులు కేంద్రంలో వివిధ హోదాల్లో ఉండటం, ఆయా రాష్ట్రాలకు చెందిన అంశాల్ని కేంద్రం వేగంగా పరిశీలించేలా చూసేందుకు తోడ్పడుతుంది’ అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘మీరు తీసుకున్న ఆ నిర్ణయం ప్రశంసనీయం. ఆ ప్రతిపాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అదే సమయంలో ప్రతిపాదిత సవరణ వల్ల తలెత్తే కొన్ని ఇబ్బందుల్ని మీ దృష్టికి తెస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో గానీ, ఆ అధికారుల అభీష్టంతో గానీ సంబంధం లేకుండానే కేంద్రం కావాలనుకున్న వారిని డిప్యూటేషన్‌పై తీసుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం కోరిన అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత గడువులోగా తప్పనిసరిగా రిలీవ్‌ చేయాలని కేంద్రం సవరణ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఐఏఎస్‌ అధికారుల పాత్ర ఎంత కీలకమైందో మీకు తెలియంది కాదు. సాధారణంగా కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే ఐఏఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇస్తాయి. ప్రస్తుతం వారు రాష్ట్రంలో ఏమైనా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారా? వారికున్న అనుభవం, నైపుణ్యం వంటి అంశాల్ని బేరీజు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌ఓసీ ఇస్తాయి. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం ఏర్పడకుండా ఎవర్ని పంపించాలో నిర్ణయించుకునే ముఖ్యమైన వెసులుబాటును.. కొత్త ప్రతిపాదనతో తొలగించినట్టవుతుంది. కేంద్రప్రభుత్వం ఎవరిని కోరితే వారిని, ఉన్నపళంగా రిలీవ్‌ చేస్తే... రాష్ట్రంలో వారు చూస్తున్న విభాగాలు, ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. అధికారుల అభీష్టంతో సంబంధం లేకుండా పంపితే వారి వ్యక్తిగత జీవితం కూడా ఒడుదొడుకులకు లోనవుతుంది. అప్పుడు వారు కేంద్ర సర్వీసులకు వెళ్లినా తమ సమర్థత మేరకు పనిచేయలేరు’ అని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.

ఎన్‌ఓసీ విధానాన్ని కొనసాగించండి

‘ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఓసీ ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగించండి. కేంద్ర డిప్యూటేషన్‌ రిజర్వుకు అవసరమైన సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఐఏఎస్‌ అధికారుల డిప్యూటేషన్‌ నిబంధనల్ని కేంద్రం ఏ ఉద్దేశంతో మార్చాలనుకుందో నేను అర్థం చేసుకున్నాను. కానీ కేంద్రం ఎవరిని కోరితే వారిని తక్షణం పంపాలన్న నిబంధనపై పునరాలోచించాలని కోరుతున్నారు. ఈ దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంపూర్ణ మద్దతు మీకుంటుందని హామీ ఇస్తున్నాను’ అని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.

ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954కు మార్పులు..

రాష్ట్ర కేడర్‌ నుంచి వచ్చి కేంద్రంలో డిప్యుటేషన్‌పై పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొంటూ ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954కు మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ పరస్పర సంప్రదింపుల ద్వారా కేంద్రం, రాష్ట్రాలు అధికారుల డిప్యుటేషన్‌కు అనుమతులిచ్చేవి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. ఏ అధికారినైనా డిప్యుటేషన్‌పై పంపించాలని కేంద్రం కోరితే ఆ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశం ఇక రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ గత ఏడాది డిసెంబరు 20, 27, ఈ ఏడాది జనవరి 6,12 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 18 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా...మరో 9 రాష్ట్రాలు సమర్థించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రం ప్రతిపాదనకు సానుకూలత తెలపగా... తెలంగాణ మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించకపోవడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:కొత్త వైరస్​పై వుహాన్​ సైంటిస్టుల వార్నింగ్- ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

Last Updated : Jan 29, 2022, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details