పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 'జగనన్న చేదోడు' పథకాన్ని ప్రారంభించిన సీఎం... అధికారులు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 'జగనన్న చేదోడు' ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దీని ద్వారా దుకాణాలు ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం అన్నారు. ఈ పథకం ద్వారా 2,47,00 మందికి రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు.
ప్రతి గ్రామ, పట్టణంలో ఉన్న అర్హులను గుర్తించామని సీఎం జగన్ వెల్లడించారు. వీరి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే ఎవరూ కంగారు పడొద్దన్న సీఎం....గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయవచ్చని సూచించారు. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. పథకాలు వర్తింపజేయడంలో ఎక్కడా వివక్ష ఉండదని పునరుద్ఘాటించారు.