మహిళల రక్షణ కోసం 'ఈ–రక్షా బంధన్' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దీనిని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు, ఉద్యోగినులు సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం ఈ-రక్షాబంధన్‌ను సీఎం ప్రారంభించారు.
రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇదివరకే అమూల్‌తో ఒప్పదం చేసుకోగా... సోమవారం వైయస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గాంబల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం కింద 4s4u.appolice.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ ఛానల్లో రకరకాల నిపుణులతో అవగాహన కల్పిస్తామన్నారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నందున వీటి వల్ల మంచి, చెడు ఏంటి? సైబర్, వైట్‌కాలర్ నేరాలు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ రక్షా బంధన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఏ యాప్‌ల వల్ల ఇబ్బందులు వస్తాయో వివరిస్తారు. నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం, దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ఇవి కాకుండా దిశ పోలీస్ స్టేషన్లలోనూ ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. తద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుంది
-జగన్, ముఖ్యమంత్రి
నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు
ఈ నెల 12న వైఎస్ఆర్ చేయూత ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున అందిస్తాం. సెప్టెంబరులో వైఎస్ఆర్ ఆసరా అమలు చేస్తాం. 9 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 90 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తాం. చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలా మందికి ఆసరా కూడా వర్తిస్తుంది. ఏటా దాదాపు రూ.6,700 కోట్లు ఆసరా కింద ఇస్తాం. ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి రూ.11 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లను కోటి మంది మహిళలకు అందిస్తాం.