CM Jagan laid Virtual Foundation Stone for 6 Food Processing Industry Projects :నాలుగున్నర సంవత్సరాల్లో 130 కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేయగలిగామని, తద్వారా 69 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా కొన్ని పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (Global Investment Summit)లో భాగంగా చేసుకున్న ఒప్పందాలకుగానూ 9 ప్రాజెక్టులు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని సీఎం వివరించారు. 422 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 6 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం :నెల్లూరు జిల్లాలో ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, ఏలూరు జిల్లా ఆగిరిపల్లెలో మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ, విజయనగరం జిల్లాలో మిల్లెట్, బంగాళాదుంప, కర్నూలు జిల్లాలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే మరో నాలుగు పరిశ్రమలకూ సీఎం శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటులో కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలని కోరారు.
YS Jagan: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ భూమిపూజ
జగన్తో భేటీ అయిన పెప్పర్ మోషన్ ప్రతినిధులు : సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సంస్థ సీఈఓ ఆండ్రియాస్ హేగర్ సహా ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.4,640 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్ క్లస్టర్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు పెప్పర్ మోషన్ సంస్థ తెలిపింది.