గ్రామ, వార్డు సచివాలయాల్లో నగదు రహిత చెల్లింపులకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్ వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులు సంయుక్తంగా ఈ సేవలను రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించేందుకు ముందుకు వచ్చాయి. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించటంలో భాగంగా ఈ యూపీఐ చెల్లింపుల విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయల్లో యూపీఏ సేవలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్‌కు సంక్షిప్త సమాచారం వస్తుందని ప్రభుత్వం తెలియజేసింది.
ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు దగ్గర చేసేందుకు వీలుగా ఈ పేమెంట్ గేట్ వే వ్యవస్థను అనుసంధానించినట్టు సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందించే 545 పౌర సేవలకు రుసుము చెల్లించే సమయంలో డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కెనరాబ్యాంకు సీఎండీ, ఎన్పీసీఐ ఎండీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.