CM Jagan holds review meeting with ministers: విశాఖపట్నంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లుపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించాలని అధికారులను జగన్ ఆదేశించారు. విశాఖ వేదికగా జీ-20 సదస్సు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో జి–20 సన్నాహక సదస్సు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వేదికగా.. వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని అధికారులను సీఎం ఆదేశించారు.
జీ -20 సమావేశాలపై సమీక్ష: జీ 20 సన్నాహక సదస్సు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని జగన్ పేర్కొన్నారు. ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఏర్పాట్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జీ -20 సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు జగన్కు తెలిపారు. ఆయా ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలన్నారు.