CM YS Jagan Review on agriculture : వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్షించారు. ధాన్యం సేకరణపై రైతుల ఆందోళనలపై అధికార్లతో మాట్లాడారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రాప్ డేటాలో నమోదు చేసిన మేరకు రైతులందరి వద్ద ధాన్యాన్ని సేకరించాలని జగన్ ఆదేశించారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని , అదే సమయంలో రైతులకు నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రబీ పై కూడా ఆయన అధికార్లకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ పై సీఎం కు అధికారులు నివేదిక అందించారు. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా... 2019–20 నుంచి 2022–23 ఖరీప్ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్ టన్నులుగా చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్న అధికారులు, ఇప్పటికే రైతులకు 89 శాతం చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ కొనసాగుతుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రైతుల ఫిర్యాదుపై: స్థానిక వీఏఓ, డీఆర్‌ఓ, సర్టిఫై చేసిన తర్వాతే ధాన్యం సేకరణ ముగిస్తామని అధికారులు తెలిపారు. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు 8వేల కోట్లు ఖర్చు అయితే వైకాపా ప్రభుత్వం హయాంలో ఏకంగా 15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నట్లు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. గతంలో లేని రీతిలో రంగుమారిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రబీకి సంబంధించి ఇ– క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని, మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.