CM JAGAN MEETING WITH CRDA AUTHORITY: ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 33వ C.R.D.A. అథారిటీ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపారు. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అమరావతిలో "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సీఎం జగన్ జీవో జారీ చేశారు. అమరావతిలో 11వందల34.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయింపు చేశారు. మొత్తం 20 లే అవుట్లలోని స్థలాలను గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48 వేల 218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలనీ నిర్ణయించారు.
ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో .. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం తెలిపారు. మే మొదటి వారంలోగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.