ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... నేటి నుంచి చెల్లింపులు - agrigold victims

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు నేడు చెక్కులు అందనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిధులు మంజూరు కాగా... సీఎం జగన్‌ స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి ముందుగా చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేశారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

By

Published : Nov 7, 2019, 6:10 AM IST

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం... వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు... బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ... గత నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. 3 లక్షల 69 వేల 655 మంది బాధితులకు ఊరట కలగనుంది.

గుంటూరులోని పోలీస్‌ పెరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి... స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇతర జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. తర్వాతి దశలో రూ.20 వేల లోపు వున్న మరో 4లక్షల మంది డిపాజిట్‌ దారులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ ప్రతిపాదనల ప్రకారం... జిల్లాల వారీగా బాధితులకు సొమ్ము అందచేయనున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 19 వేల మంది వరకూ అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి అందించాల్సిన చెక్కులు సిద్ధం చేశారు. ఆన్​లైన్ చెల్లింపులకు సంబంధించిన వెబ్​సైట్‌ను సీఎం ప్రారంభిస్తారు.

సీఎం పర్యటన... ఏర్పాట్లు పూర్తి...
ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పర్యటన కోసం... ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, చెరుకువాడ రంగనాథరాజు సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. వెయ్యి మంది పోలీసు సిబ్బందితో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించగా... కలెక్టర్ కార్యాలయం నుంచి రమేష్ ఆసుపత్రి వరకూ వాహనాల రాకపోకలు నిషేధించారు.

ఇదీ చదవండీ... 'అర్చకులంతా.. సీఎంకు రుణపడి ఉంటారు'

ABOUT THE AUTHOR

...view details