సివిల్స్ సర్వీసెస్-2019 ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘన విజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. తమ ప్రతిభను విధి నిర్వహణలోనూ చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్-2019 ఫలితాల్లో ఈసారి తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 50 మంది ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన శిక్షణ ఐపీఎస్ పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లవరపు సూర్యతేజ 76వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని పొందారు. ఏటా మొదటి 10 లేదా 20 ర్యాంకుల్లోపు తెలుగు అభ్యర్థులు నిలుస్తుండగా ఈసారి వారికి చోటు దక్కలేదు. వంద ర్యాంకుల లోపు నలుగురు, 200 లోపు మొత్తం తొమ్మిది మంది మాత్రమే ర్యాంకులు సాధించారు.