CM JAGAN ON EDUCATION : ప్రభుత్వ విశ్వవిద్యాలయాల దశ, దిశ మారుస్తామని.. ఖాళీలు భర్తీ చేస్తామని మూడున్నరేళ్లుగా సీఎం జగన్ ప్రకటనలు బుట్టదాఖలయ్యాయి. అన్ని వర్సిటీల్లో కలిపి 3,864 బోధనా సిబ్బంది పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 1,100 మందే పనిచేస్తున్నారు. 71శాతానికిపైగా బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. మరో 3, 4 నెలల్లో పదవీ విరమణ చేసే వారు అధికంగా ఉన్నారు. ఒకపక్క నియామకాలు చేపట్టకపోగా,.. వర్సిటీల్లోని నిధులను ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలంటూ ప్రభుత్వమే లాగేసుకుంటోంది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామంటూనే కోతలు విధిస్తోంది.
2020-21లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నాలుగో త్రైమాసిక ఫీజును చెల్లించలేదు. ఈ మొత్తాన్ని చాలా కళాశాలలు విద్యార్థుల నుంచే వసూలు చేశాయి. 2020-21నుంచి ప్రైవేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు ఫీజుల చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పీజీ చదివేవారు తగ్గిపోయారు. ట్రిపుల్‌ఐటీలకు సంబంధించి ఉపకులపతినే నియమించలేకపోయింది. ఒంగోలు ట్రిపుల్‌ఐటీ నిర్మాణ స్థలాన్ని మార్పు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేసింది.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, సిబ్బంది పోస్టులను తక్షణం భర్తీ చేస్తామని.. మంచి అర్హత కలిగిన వారిని నియమిస్తామని చెప్పినా.. ఈ మూడున్నరేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. 2వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్రానికి గర్వకారణమైన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఖాళీల గురించి గతంలో సీఎం జగన్ గతంలో ఎంతగా బాధపడ్డారో ఒకసారి చూద్దాం.
ఏటా రూ.100 కోట్లకు పైగా అదనపు ఖర్చు:ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దేశంలోనే 14వ స్థానంలో ఉండటం తన గుండెల్లో గుచ్చుకుంటోందంటూ సీఎం బాధను వ్యక్తం చేయడం చూశాం కదా...కానీ నేటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. వర్సిటీలో 936 పోస్టులకు గాను.. రెగ్యులర్ ఆచార్యులు 216 మందే ఉన్నారు. వర్సిటీకి నిధులు ఇవ్వకపోగా ఉన్నవాటినే రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని లాగేసుకుంది. ఇప్పటికే కార్పొరేషన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 10కోట్లు డిపాజిట్ చేసింది. మంజూరైన పోస్టులకు జీతభత్యాలు, పింఛన్లకు 366 కోట్లు, మినిమం టైం స్కేల్లో పనిచేసేవారికి 26 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం అన్నింటికీ కలిపి 280 కోట్లే ఇస్తోంది. దీంతో విశ్వవిద్యాలయం.. ఫీజులు, ఇతర ఆదాయం నుంచి ఏటా 100 కోట్లకు పైగా అదనంగా ఖర్చుచేస్తోంది.