CM Jagan Cheating Dairy Farmers: అమూల్‌ని అందలం ఎక్కించారు.. మరి రైతులకు ఇస్తామన్న బోనస్ ఏది జగనన్నా..? CM Jagan Cheating Dairy Farmers: అమూల్ సంస్థకు ప్రజాధనాన్ని ధారపోస్తున్న జగన్ ప్రభుత్వం.. స్థానికంగా ఉన్నసహకార పాల ఉత్పత్తి సంఘాలను కాదని అమూల్‌కు (Amul Dairy) అగ్రస్థానం ఇచ్చింది. రాష్ట్రంలో మూతపడిన సహకార రంగంలోని డెయిరీలను పునరుద్ధరించాల్సింది పోయి వైసీపీ ప్రభుత్వం అమూల్ పాలసేకరణకు అన్నీ తానై సాగిలపడుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని అమూల్‌కు అప్పగించేసింది.
చిత్తూరు డెయిరీని 99 ఏళ్ల కాలపరిమితితో నామమాత్రపు ఫీజుకే జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. అమూల్ (Amul) పాల సేకరణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చిస్తోంది. నాబార్డు నుంచి తీసుకున్న రుణంతో రాష్ట్రంలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అమూల్‌కు సహకారం అందిస్తోంది.
రాష్ట్ర ఖజానాని.... సర్వం అమూల్‌కే సమర్పిస్తున్న ప్రభుత్వం
జగనన్న పాలవెల్లువ పేరుతో అమూల్ సంస్థకు ప్రజాధనాన్ని ధారపోస్తున్న ఏపీ ప్రభుత్వం (CM Jagan Support to Amul Dairy) పాడి రైతులకు ఇస్తామన్న 4 రూపాయల బోనస్ విషయాన్ని మాత్రం మాట్లాడటం లేదు. అయితే స్థానిక డెయిరీలు మాత్రం ఎప్పటికప్పుడు అమూల్ నుంచి పోటీని ఎదుర్కుంటూనే.. తమకు పాలు పోసే రైతులకు బోనస్‌లు, ఇతర ఆర్ధిక సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయి.
విజయవాడలోని విజయ డెయిరీ పరిధిలో ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని లక్షల మంది రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థ మెరుగైన పాలధరను చెల్లించటంతో పాటు.. పశువుల బాగోగులూ, రైతుల సంక్షేమాన్ని అమలు చేస్తోంది. పాడి రైతులకు, డెయిరీ యాజమాన్యానికి సత్సంబంధాలు కొనసాగుండటం వల్లే స్థానిక డెయిరీలు విజయం సాధిస్తున్నాయని.. సొసైటీ రైతులు స్పష్టం చేస్తున్నారు.
అమూల్‌కే అన్నీ.. డెయిరీలు వాటి ఆస్తులు
పాడి రైతుల సంక్షేమం లాంటి కార్యక్రమాలను కృష్ణా మిల్క్ యూనియన్ వారి విజయ డెయిరీ (Vijaya Dairy), విశాఖ డెయిరీ (Visakha Dairy) సహా రాష్ట్రంలోని వేర్వేరు డెయిరీలు అమలు చేస్తున్నాయి. పశువుల కొనుగోలుకూ రాయితీ వడ్డీతో కూడిన రుణాలను సహకార డెయిరీలు అందించటం.. పాడి రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తోంది. అందుకే అమ్మలాంటి సహకార డెయిరీలను వదిలేసి ఎక్కడినుంచో వచ్చిన కంపెనీకి ఎలా పాలుపోస్తామని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.
అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుని దాదాపు మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ రోజువారీ పాలసేకరణ 2 లక్షల లీటర్లకూ చేరని పరిస్థితి. వాస్తవానికి రాష్ట్రంలోని సహకార డెయిరీలతో పోలిస్తే.. పాడి రైతులకు అమూల్ చెల్లించేది తక్కువగానే ఉంటోంది. అమూల్ కన్నా కృష్ణా మిల్క్ యూనియన్, విశాఖ డెయిరీ, సంగం డెయిరీలు లీటరుకు 15 రూపాయల కన్నా ఎక్కువే చెల్లిస్తున్నాయి. ఏటా బోనస్‌లతోపాటు.. పశువులకు ఉచిత వైద్యం, పాడి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం అమూల్ బ్రాండ్‌నే అందలం ఎక్కిస్తూ సొంత డెయిరీల బ్రాండ్‌ను దెబ్బతీస్తోంది.
Amul Dairy: మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్ కార్పెట్ వేసి మరీ సహకారం..!
ఏపీలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే అమూల్ ప్రతినిధిలా వ్యవహరిస్తోంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు జగనన్న పాలవెల్లువ అంటూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా పాలను సేకరించి అమూల్‌కు సరఫరా చేస్తోంది. పాలసేకరణకు అవసరమైన ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వమే సొంతఖర్చుతో ఏర్పాటు చేసింది. పట్టణాల్లోనూ అమూల్ మిల్క్ అవుట్ లెట్లకూ స్థలాలను కేటాయిస్తోంది. అమూల్ పెట్టుబడి లేకుండానే ఏపీలో ప్రభుత్వ సహకారంతో వ్యాపారం చేస్తోందన్నది ప్రధాన ఆరోపణ.
వాస్తవానికి పశుసంవర్ధక అధికారులతో పాటు ఏపీ పాల అభివృద్ధి సహకార సంస్థ కూడా అమూల్ కోసమే పనిచేస్తున్నాయి. ప్రతీ సభలోనూ అమూల్‌తో రైతుల ఆదాయం పెరిగిందంటూ చెప్పుకొచ్చే ముఖ్యమంత్రి జగన్.. సహకార డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు 4 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామన్న హామీని మాత్రం ఎప్పుడో మర్చిపోయారు.
Sangam Diary: అమూల్ డెయిరీ కోసం... మన రాష్ట్ర డెయిరీలను అభివృద్ది చేయడం లేదు: ధూళిపాళ్ల నరేంద్ర