ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలలో సీటు భయం - సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ - ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు

CM Jagan Changing Sitting MLAs: సొంత పార్టీలో సిట్టింగుల సీట్లపై ముఖ్యమంత్రి జగన్‌ కత్తికట్టారు. ఇప్పటికే నలుగురు మంత్రులకు స్థానచలనం కల్పించిన సీఎం మరో ఇద్దరు మంత్రులకు మొండిచెయ్యి చూపినట్లు సమాచారం. తాజాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్‌తో భేటీ అయి తమ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మా పరిస్థితేంటో అని పలువురు మథనపడుతూ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు.

CM_Jagan_Changing_Sitting_MLAs
CM_Jagan_Changing_Sitting_MLAs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 10:07 AM IST

వైఎస్సార్సీపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలలో సీటు భయం-సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ

CM Jagan Changing Sitting MLAs :మంత్రులు, దళిత, గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వారి సీట్లకు గ్యారంటీ లేదు. తన, పర భేదం లేదు. నమ్మిన వారైనా నమ్ముకున్నవారైనా సరే తాను వద్దనుకుంటే టికెట్లు లేవని ముఖ్యమంత్రి జగన్‌ తేల్చి చెప్పేస్తున్నారు. '' మీరంతా నా సొంత మనుషులు మిమ్మల్ని వదులుకోను'' అంటూ MLAలను నమ్మించిన సీఎం జగన్‌. ఇప్పుడు ఓట్ల లెక్కలు వచ్చేసరికి.. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ ఎప్పుడు ఎవరి టికెట్‌ చించేస్తారో అనే ఆందోళన ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లోనే కాదు మంత్రుల్లోనూ తీవ్రస్థాయిలో ఉంది. ఎప్పుడు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తుందో పిలుపు వస్తే ఇక టికెట్‌ పోయినట్లేఅనేది ఇప్పుడు వైఎస్సార్సీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

CM Jagan Meeting With MLAs in Tadepalli : ఇప్పటికే నలుగురు మంత్రులకు స్థానచలనం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌. మంగళవారం మరో ఇద్దరు మంత్రులు విశ్వరూప్‌, గుమ్మనూరు జయరామ్‌తో సమావేశమవడం చర్చనీయాంశమైంది. పినిపె విశ్వరూప్‌ అమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆ స్థానంలో ఆయన కుమారుడిని రంగంలోకి దించుతారని లేదా విశ్వరూప్‌నే మరో నియోజకవర్గానికి పంపుతారనే ప్రచారం సాగుతోంది. భేటీలో సీఎం ఆయనకు ఏం చెప్పారనేది తెలియరాలేదు. మరో మంత్రి, ఆలూరు MLA గుమ్మనూరు జయరాంకు ఈసారి టికెటివ్వరనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం సీఎంని కలిసి మాట్లాడారు. గుమ్మనూరును కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని గతంలో సీఎం సూచించినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి.

బాలినేని సూచించిన వ్యక్తికే సంతనూతలపాడు టికెట్ ఇవ్వాలి: వైసీపీ నేతలు

ఆలూరులో జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షిని నియోజకవర్గంలో తిరగాలని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పడం ఈ వాదనకు బలాన్నిస్తోంది. దీంతో మంత్రికి ఆలూరు టికెట్‌ లేనట్లేనన్న అభిప్రాయం బలపడుతోంది. కర్నూలు ఎంపీ టికెట్‌పై మరో నేతకు పార్టీ అధినాయకత్వం భరోసా ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో గుమ్మనూరుకు అక్కడా అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. తనకు లేదా కుమారుడికి టికెట్ ఇవ్వాలంటూ మంత్రి గతంలోనే జగన్‌ను కోరినా ఆయన సానుకూలంగా స్పందించలేదు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. వీరిలో నాగిరెడ్డి స్థానంలో ఇప్పటికే కొత్త సమన్వయకర్తను నియమించారు. చిట్టిబాబుకు కూడా ఈసారి అవకాశం లేదని సీఎం చెప్పినట్లు సమాచారం.

YSRCP Changes Constituency Incharge :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం, పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సీఎంను కలిసినప్పుడు అమలాపురం ఎంపీగా పోటీచేస్తే బాగుంటుందని జగన్‌ సూచించినట్లు తెలిసింది. జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన తనకు రాబోయే ఎన్నికల్లో రాజోలులో మళ్లీ గెలవడం ప్రతిష్ఠాత్మకమని అక్కడే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నానని రాపాక చెప్పినట్లు సమాచారం. దీనిపై వారిద్దరి మధ్య కాసేపు చర్చ జరిగింది. రాపాకను రాజోలులోనే కొనసాగిస్తారా? మరోచోటకు మారుస్తారా అనేదానిపై స్పష్టత రాకుండానే వారి భేటీ ముగిసింది.

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

2024 Election in Andhra Pradesh :ఉమ్మడి పశ్చిమగోదావరిలో ఇప్పటివరకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే టి.బాలరాజుకు టికెట్ ఆపినట్లు తెలిసింది. ఎలీజాను మొదట అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించి, ఇప్పుడు ఏమీ లేకుండా చేశారని సమాచారం. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గానికి వెళ్లమని సీఎం చెప్పారంటున్నారు. అయితే ఆయన కాకినాడ జిల్లాలోనే సీటు కోరుకుంటున్నారు. ఆయన కోసం ఆ జిల్లాలోని సీఎం సన్నిహిత ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే కాకినాడ ఎంపీగా పంపి, ఆ స్థానంలో వేణుకు టికెట్‌ ఇప్పించేందుకు ఆయన లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

YSRCP Changing Sitting MLAs :ఒక్కొక్క ఎమ్మెల్యే, మంత్రికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని నిర్ధారణ అయిపోతున్న నేపథ్యంలో తమ పరిస్థితేంటో తెలుసుకునేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి తదితరులను కలిసి తమ భవిష్యత్తుపై ఆరా తీస్తున్నారు. వారికున్న బలాల్ని వివరిస్తూ తమ సీటును కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్, పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణ, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మైదుకూరు ఎమ్మెల్యే S.రఘురామిరెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్‌ నవాజ్‌బాషా తదితరులు మంగళవారం తాడేపల్లికి వచ్చి వెళ్లారు. ప్రభుత్వ చీఫ్ విప్‌, నరసాపురం MLA ముదునూరి ప్రసాదరాజు కూడా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిశారు. నియోజకవర్గ పనులపై మాట్లాడేందుకే సీఎంవోకు వచ్చానని.. సీటు మార్పులకు తాను వచ్చిన పనికి సంబంధం లేదని ప్రసాదరాజు విలేకర్లతో చెప్పారు.

ప్రస్తుతం నరసాపురం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీకి అభ్యర్థి దొరకడం లేదు. ఆ నియోజకవర్గ పార్టీ బాధ్యుడు GVK రంగరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంలో ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీగా పోటీచేసిన ప్రసాదరాజువైపు పార్టీ అధిష్ఠానం చూస్తోందా అనే చర్చ జరుగుతోంది. దూలం నాగేశ్వరరావు కొల్లేరు ప్రాంతంలో రోడ్ల పనుల గురించి మాట్లాడేందుకు ధనుంజయరెడ్డిని కలిసినట్లు చెబుతున్నారు.

వైసీపీలో మెుదలైన ముస‌లం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details