CM Jagan BIG SHOCK TO Ministers and MLAs: రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ సిద్దమవుతుంది. అందుకోసం ప్రభుత్వంపై వ్యతిరేకత, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతల మార్పుపై వైసీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందంటే మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమకు స్థానచలనం ఉంటుందో ? లేక స్థానమే లేకుండా పోతుందో ? అన్న అంశంపై, సీఎం జగన్ ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నుంచి పిలుపు రావడం, వారితో సీఎం జగన్ చర్చలు జరపడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేఫథ్యంలో ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్చార్జీలను మార్చారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నట్లు అభ్యర్థులకు స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ చార్జీల మార్పుపై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం సీఎంను కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై వీరితో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్చార్జీలను ఖరారు చేస్తున్నారు. పోటీ చేసే స్థానాల విషయమై స్పష్టత ఇస్తున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తమ సీటు విషయమై చర్చించారు.