CM Jagan Autocracy in AP: బాధితుల్ని పరామర్శిస్తే కేసు! నిరసనకు బయల్దేరితే కేసు! అధికార పార్టీ నేతల్ని పల్లెత్తు మాటన్నా, చివరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా కేసే! కదిలితే కేసులు.. అడుగు బడటపెడితే నిర్బంధాలు! ఇవేవీ నిత్యకల్లోలిత కశ్మీర్‌లోనో, అల్లర్లతో అట్టుడికే ఈశాన్య రాష్ట్రాల్లోనో కాదు! ఆంధ్ర రాష్ట్రంలోనే! నిరంకుశత్వానికి నీరో చక్రవర్తి లాంటి జగనన్న ఏలుబడిలోనే! 144 సెక్షన్, పోలీసు యాక్ట్ 30ని వైరిపక్షాలపై విచ్చలవిడాగా ప్రయోగిస్తూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు పాతరేస్తున్నారు. తాలిబన్లను మించిన నియంతృత్వంతో..ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
CM Jagan Autocracy in AP :ప్రతిపక్ష నేత చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లలో కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్తుంటే.. గేట్లకు తాళ్లు కట్టి ఆపేశారు. గతంలో ఏ ప్రతిపక్ష నేతనైనా ఇలా నిర్బంధించారా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచీ పోలీస్ ఆంక్షలు విధించించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. కనీసం కార్యకర్తలకు అభివాదం కూడా చేయడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేశారంటే మనం ఆంధ్రలోనే ఉన్నామా? అరాచక రాజ్యంలోఉన్నామా.?
Cases on Opposition Leaders in YSRCP Government :పార్టీ అధినేతలపైనే ఇంతటి నిర్బంధాలుం..ఇక నాయకుల సంగతిప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందు రోజు రాత్రే పోలీసులు ముఖ్య నేతల ఇళ్లను చుట్టుముడతారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు కొన్నాళ్ల క్రితం రాయదుర్గంలో పాదయాత్ర తలపెట్టగా పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి అడుగు బయట పెట్టనీయలేదు.
YSRCP Government Restrictions on TDP Leaders : పశ్చిమగోదావరి జిల్లా పెరుగులంక భూముల్లో వైకాపా నాయకుల మట్టి అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపైనా అదే నిర్బంధం. విశాఖ రుషికొండపై అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన ఏ పార్టీ నేతనూ పోలీసులు అనుమతించలేదు. దీనికి పోలీసులు చెప్పే సాకు శాంతిభద్రతల సమస్య!
Anti Democratic Acts in CM Jagan Government: రాష్ట్రంలో జగనన్న రాజ్యాంగం వర్సెస్ భారత రాజ్యాంగం!.. ప్రజాస్వామిక హక్కులపై జగన్ ఉక్కుపాదం
AP Police Filed Cases on Opposition Leaders :అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్తే.. శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుంది? ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తే వచ్చే నష్టమేంటి? అంటే అధికారపార్టీ నాయకుల తప్పుల్ని ప్రశ్నించకూడదు? ప్రజలకు చూపించకూడదు? ఇది ప్రాథమిక హక్కుల్ని హరించడంకాక మరేంటి?
ప్రశ్నిస్తే కేసులు :జగన్ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులు పరామర్శలకు వెళ్లాలన్నా పోలీసుల్ని బతిమాలుకోవాల్సిందే. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన టీడీపీ దళిత నాయకులు వంగలపూడి అనిత, ఎం.ఎస్.రాజులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బీసీలు మచిలీపట్నంలో సైకిల్ యాత్ర చేపడితే ఆయన్ను నిర్బంధించారు. R5 జోన్‌కు వ్యతిరేకంగా అమరావతి రైతులు శాంతియుత నిరసన ప్రదర్శన చేపడతామంటే.. 144 సెక్షన్ అమల్లో ఉందంటూ నిర్బంధించి దాడి చేశారు. ఇదే అంశంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ పాదయాత్రకు సిద్ధమవ్వగా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
అంబేడ్కర్ రాజ్యాంగం.. జగన్ విరచిత రాజ్యాంగం : ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాకాల్లోనైతే నిర్బంధాలకు అంతేలేదు. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలు విపక్ష నాయకులు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇల్లు కదలనివ్వరు. ఇదేంటనినోరెత్తితే ఇక కేసు కట్టేస్తారు. అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగమే అమలవుతోందా? లేదా జగన్ విరచిత రాజ్యాంగం నడుస్తోందా? ప్రతిపక్షాల భావప్రకటన స్వేచ్ఛనూ.. హరించే నియంతృత్వం రానురాను మితిమీరుతోంది.
Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్
ప్రతిపక్షాల ఆందోళనలకే రాష్ట్రంలో అడ్డంకులుంటాయి. అధికార పార్టీ కార్యక్రమాలకు మాత్రం పోలీసులే దగ్గరుండి కాపలా కాస్తారు. ప్రతిపక్ష నాయకులపైకి, పాదయాత్ర చేసే రైతులపైకి రాళ్లు రువ్వడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల్లో ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించడం లాంటి చర్యలకు వైసీపీ నాయకులు తెగబడినా పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ గుర్తు రాదు.
జగన్ నిరంకుశత్వానికి కాలమే సమాధానం : ప్రతిపక్షాలపైనే ఈ నిర్బంధం ఎందుకు? వారికిభావప్రకటనా స్వేచ్ఛ తీసేశారా? పోలీసులను అడ్డంపెట్టుకుని ఎంతకాలం కట్టడి చేస్తారు? హక్కుల కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడటం, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం, శాంతియుత ప్రదర్శనల ద్వారా గళం వినిపించడం, బాధితులను పరామర్శించి సంఘీభావం తెలపడం, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం జగనన్న రాజ్యంలో నేరమా? హౌస్ అరెస్ట్ అనే అంశమే CRPCలో లేదని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో వాదనలు వినిపించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అది నిజమే! మరి విపక్ష నాయకుల్ని ఏ చట్టం ప్రకారం నిర్బంధిస్తున్నారు! ఈ జగన్ మార్క్ నిరంకుశత్వానికి కాలమే సమాధానం చెప్పాలి.
జగన్ రాజ్యాంగంలో హక్కులు హరీ!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు- బాధితులను పరామర్శించాలనుకుంటే గృహనిర్బంధాలు-ప్రతిపక్షాలపై జగన్ రాజ్యాంగం!