ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు: సీఎం - pollution control board

70వ వనమహోత్సవం సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కాలుష్య నియంత్రణ మండలిని పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని వెల్లడించారు. ఏపీఎస్​ఆర్టీసీలో దశలవారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు తెస్తామని పేర్కొన్నారు.

jagan

By

Published : Aug 31, 2019, 2:02 PM IST

వనమహోత్సవంలో సీఎం జగన్ ప్రసంగం

పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ వ్యవసాయ సీజన్​లో 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ ఒక్కరోజు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వనమహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ముఖ్యమంత్రి... పులులు, సింహాలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని భూభాగంలో కేవలం 23 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. అందుకే 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని... ఇప్పటికే 4 కోట్ల మొక్కలు నాటామని సీఎం జగన్ అన్నారు. మొక్కలు పెంచేందుకు ముందుకొస్తే గ్రామ వాలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి ప్రక్షాళన

పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొక్కలు నాటాలని సీఎం కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్న సీఎం... అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలిని పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని ప్రకటించారు. పర్యావరణానికి ఎలాంటి హామీ లేదని చెప్పాకే పరిశ్రమల ఏర్పాటు దస్త్రం ముందుకు కదులుతుందని వెల్లడించారు. ఫార్మారంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుండగా... కేవలం 30 వేల టన్నులకు మాత్రమే ఆడిటింగ్‌ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. త్వరలో గ్రీన్ ట్యాక్స్​ను తెస్తున్నామన్న ముఖ్యమంత్రి... ఈ ఏడాది ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. దశలవారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు తెస్తామని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణాన్ని కాపాడతామని విద్యార్థులు, మంత్రులు, అధికారులు, ప్రజలతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిజ్ఞ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details