కరోనా వైరస్ వ్యాప్తి వలన విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రేపటి నుంచి 1-10తరగతులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6-9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో పాఠశాలలకు రావచ్చు.
1-5 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను నేడు వారికి అందించనున్నారు. ఆంగ్ల మాధ్యమం విధానంలోనే ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు, 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తారు.
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ప్రసారమవుతాయి. జూన్ నెల చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
- 1-5 తరగతులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి.
- 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి.
- 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి.
- పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం బడులకు వెళ్లాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులు విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యాంకనం చేయాలి.
ఇదీ చదవండి:అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చొన్న చిరుత!