గుంటూరు నగరంలో సున్నా శాతం కరోనా కేసులే లక్ష్యంగా పని చేస్తున్నామని.. ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడమే కాక.. కొవిడ్ నిబంధనలు పాటించాలని నగర మేయర్ కావటి మనోహర నాయుడు కోరారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తో కలసి కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అపోహలు వీడి.. ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మెప్మా ఆర్.పి.లు, వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా డోర్ టు డోర్ తిరిగి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని సూచించారు.
కొవిడ్ సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని ఎమ్మెల్యే గిరిధర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ పరిరక్షణ పాటించాలన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని.. ప్రజలు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు.