Darapaneni Narendra was released: సామాజిక మాధ్యమాల పోస్టుని షేర్ చేసిన కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర విడుదలయ్యారు. సీఐడీ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయన్ను విడిచిపెట్టారు. గురువారం నాడు నాటకీయ పరిణామాల మధ్య న్యాయమూర్తి ఇంటి వద్ద నరేంద్రను సీఐడీ అధికారులు హాజరుపర్చారు. తనను సీఐడీ అధికారులు హింసించారని న్యాయమూర్తికి నరేంద్ర వాంగ్మూలం ఇచ్చారు. దీంతో నరేంద్రకు వైద్య పరిక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఆ మేరకు జీజీహెచ్ లో నిపుణుల కమిటిని ఏర్పాటు చేశారు. రాత్రి 9.30గంటల సమయంలో జీజీహెచ్ కు తీసుకెళ్లారు. అప్పటికప్పుడు వైద్యులను పిలిపించి నరేంద్రకు పరీక్షలు చేయించారు. నలుగురు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నరేంద్రను పరీక్షించి నివేదిక రూపొందించారు. ఆ నివేదికను సీల్డ్ కవర్లో సీఐడీ అధికారులకు అందజేశారు. వైద్యుల నివేదిక తీసుకున్నసీఐడీ అధికారులు.. తెల్లవారుజామున 2గంటల సమయంలో నరేంద్రను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. నరేంద్రను రిమాండ్ కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి రిమాండ్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే సీఐడీ అధికారుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు.
నరేంద్రపై నమోదైన కేసులో అన్నీ బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి రిమాండ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తి ఆయన్ను విడుదల చేయాలని ఆదేశించారు. 25వేల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలన్నారు. దీంతో నరేంద్ర సీఐడీ కస్టడీ నుంచి విడుదలయ్యారు. సీఐడీ అధికారులు తనను ఇబ్బంది పెట్టిన తీరుపై నరేంద్ర ఆవేదన వెలిబుచ్చారు. నరేంద్ర అరెస్టు అక్రమం కాబట్టే బెయిల్ వచ్చిందని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. నరేంద్రకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, ఇతర తెదేపా నాయకులు స్వాగతం పలికారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యవహార శైలిపై నక్కా ఆనంద్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రల్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు.
అసలేం జరిగిందంటే:తెలుగుదేశం కేంద్ర కార్యాలయ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గుంటూరు అరండల్‌పేట యాగంటి అపార్ట్‌మెంట్స్‌లోని నివాసానికి చేరుకున్న సీఐడీ అధికారులు.. రెండు గంటలపాటు నరేంద్రను ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి.. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టుకు ముందు నరేంద్రకు సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయన భార్య సౌభాగ్యలక్ష్మికి అరెస్ట్ విషయం చెప్పి నరేంద్రను తీసుకెళ్లారు. ఆయనపై 153A, 505, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.