Chilli Prices Reduced in Guntur Mirchi Yard: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో మిర్చి రావడం లేదు. దీంతో ఎగుమతులు భారీగా తగ్గి..క్వింటా మిర్చి రూ.500 నుంచి రూ.1000 వరకు పడిపోయింది. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు మిర్చి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో.. రైతులు పంటను అమ్ముకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు చైనా మార్కెట్ నుంచి ఆర్డర్లు రాకపోవటంతో.. మిర్చి ధరలు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అప్పులు చేసి మిర్చి పంట వేసినా రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.
Current Chilli Prices in Guntur Yard:గుంటూరు మిర్చియార్డులో మిర్చి ధరలు నవంబరు తొలివారంతో పోల్చితే.. కొంత తగ్గుముఖం పట్టాయి. తేజ రకానికి అక్టోబరు చివరలో క్వింటా 25వేల రూపాయలు ధర పలుకగా.. ప్రస్తుతం 23వేల 800 నుంచి 24వేల రూపాయలు నడుస్తోంది. మిగిలిన రకాలు నాణ్యతను బట్టి.. 500 నుంచి వేయి రూపాయలు తగ్గాయి. చైనాకు ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం వల్ల ధరలు కొంత తగ్గాయి. అలాగే, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో మిర్చి పంట బాగుండటం, శీతల గోదాముల్లో నిల్వలు ఉండటం కూడా ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది.
MIRCHI: గుంటూరు మిర్చి రైతులకు నిరాశ.. దక్కని 'పంట బీమా'
Guntur Chillies Export Decreased International:ఈ క్రమంలో ప్రస్తుతం చైనాకు ఎగుమతులు లేకపోవడంతో బంగ్లాదేశ్‌కు.. మిర్చి సరఫరా చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో అక్కడి మార్కెట్లకు వారానికి సుమారుగా.. లక్షా 25వేల టిక్కీల వరకు మిర్చి వస్తోంది. స్థానికంగా 50శాతం వినియోగం ఉండగా.. చుట్టుపక్కల రాష్ట్రాలకు 50శాతం సరకు అక్కడి నుంచే సరఫరా అవుతోంది. ఫలితంగా గుంటూరు నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు సరకు రవాణా తగ్గింది. గుంటూరు నుంచి చైనాతో పాటు బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. దీంతో అంతర్జాతీయంగా మన పంటకు గిరాకీ తగ్గిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.