గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను ఆదివారం గణపవరం సీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన సూపర్‌వైజర్లు... సిబ్బందికి శుక్రవారం శిక్షణ నిర్వహించారు. చిలకలూరిపేట పురపాలక ఎన్నికల ప్రత్యేక అధికారి డేవిడ్ రాజు, సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు.
అయితే.. పురపాలక సంఘంలో కొత్తగా విలీనమై ఎన్నికలు జరిగిన గణపవరం, పసుమర్రు గ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నందున తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని... ఆ విధంగానే గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది.
నిబంధనలపై అవగాహన
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చిలకలూరిపేట పురపాలక ఎన్నికల ప్రత్యేకాధికారి డేవిడ్ రాజు తెలిపారు. గణపవరం సీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్ విధులలో పాల్గొనే సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజు కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనల గురించి అవగాహన కల్పించారు. కౌంటింగ్ సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది రిపోర్టు చేయాలన్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలని చెప్పారు.