గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా జడ్పీటీసీ అభ్యర్థిని నాగభైరు విజయలక్ష్మీ వైకాపాలో చేరారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో శుక్రవారం ఆమె భర్తతో కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గతంలో చిలకలూరిపేట నుంచి వైకాపా జడ్పీటీసీ టికెట్ ఆశించగా.. అధిష్ఠానం ఆమెకు టికెట్ నిరాకరించింది. దీంతో తెదేపా తీర్థం పుచ్చుకుని బరిలో నిలిచి గెలిచారు. తాజాగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
జడ్పీటీసీ నాగ భైరు విజయలక్ష్మి, ఆమె భర్త వెంకట్లు తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విజయలక్ష్మి, వెంకట్‌లను అద్దంకి వైకాపా ఇంఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య చిలకలూరిపేటలోని వైకాపా కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇద్దరికీ వైకాపా కండువాలు వేసి మంత్రి బాలినేని పార్టీలోకి ఆహ్వానించారు. మొదటి నుంచి కూడా ఇద్దరూ వైకాపా పార్టీ వారేనని, వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హైదరాబాదులో సంబరాలు చేసుకున్నారని అన్నారు. ఎట్టకేలకు వారు తిరిగి సొంత గూటికి చేరడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.