CS JAWAHAR MEETING WITH SECRETARIES: సచివాలయంలో ఈ నెల 16 తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాలకు మరిన్ని అధికారాల బదలాయింపు, సామర్థ్యం పెంపు తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సహా గ్రామ, వార్డు సచివాలయ ఖాళీల భర్తీపైనా కార్యదర్శుల సమావేశంలో చర్చించనున్నారు.
సచివాలయంలో విధుల పునఃవ్యవస్థీకరణ అనంతరం దస్త్రాల నిర్వహణ, పని భారం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ నిర్దేశించిన విధానంలో ఈ-ఆఫీస్ దస్త్రాల నిర్వహణ, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసులపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. వివిధ శాఖల వారీగా ప్రభుత్వంపై నమోదైన కోర్టు కేసులు, విచారణ పెండింగ్ అంశాలపై కార్యదర్శుల సమావేశం సమీక్ష చేయనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన కసరత్తు పైనా కార్యదర్శులు చర్చించనున్నారు.