Chief Secretary Review On Global Investors Summit: విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు విశాఖలో సీపీ, అదేవిధంగా కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.
ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు, డెలిగేట్లకు ఎక్కడా అసౌకర్యం లేకుండా.. ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ శాఖల్లోని పెట్టుబడి అవకాశాలపై చర్చ జరుగుతుందని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారు.