YS Jagan Review on Higher Education: ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నత విద్యాశాఖ సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షాసమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డితో పాటు... ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్ కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది భర్తీని త్వరితగతిన చేపట్టాలని సీఎం సూచించారు. డిగ్రీ చదువుతున్నవిద్యార్థుల నైపుణ్యాలను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించాలని, వాటిని ఇక్కడి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్: జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలని, సర్టిఫైడ్ ఆన్‌లైన్ వర్టికల్స్ కరిక్యులమ్‌లో భాగం కావాలన్నారు. ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందన్నారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలని సూచించారు. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్ చేసుకోవాలని సీఎం నిర్దేశించారు. రిస్క్ అనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలని, వచ్చే జూన్ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలని సీఎం సూచించారు.
నాక్ అక్రిడిటేషన్: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలోనూ బోధనాపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలని సీఎం ఆదేశించారు. ప్రతి విద్యాసంస్థ నాక్ అక్రిడిటేషన్ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలని సూచించారు. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ కచ్చితంగా సాధించాలని సీఎం స్పష్టంచేశారు. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాల్టి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలన్నారు.