కృష్ణా జలాల విషయంలో ఏపీ వైఖరిని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని అన్నారు. ఎన్జీటీ స్టే విధించినప్పటికీ అక్రమంగా నిర్మిస్తోందని తెలిపారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.
ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్ట్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ కూడా అక్రమ ప్రాజెక్టే అని కేసీఆర్ వెల్లడించారు. జులై 9న నిర్వహించబోయే కేఆర్ఎంబీ సమావేశాన్ని రద్దు చేయాలని... జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి కోరారు. తెలంగాణ అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలని అన్నారు. ఎజెండాను కృష్ణానది యాజమాన్య బోర్డుకు పంపాలని అధికారులకు సూచించారు.
ఆ హక్కు కేఆర్ఎంబీకి లేదు
ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలన్నారు. ఇరురాష్ట్రాలకు మొత్తం 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపు జరిపారని.. తెలంగాణ, ఆంధ్ర చెరో 405.5 టీఎంసీలు వాడుకోవాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాగాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు. జల విద్యుత్‌పై ఇరు రాష్ట్రాల నడుమ ఎలాంటి ఒప్పందాలు లేవని, విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీ జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కృష్ణా జలాలను వృథా చేస్తున్నామనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోవచ్చని పేర్కొన్నారు.
నీటిని చెరువులకు వదలాలి