CBN FIRES ON YSRCP : వైకాపా సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగిస్తూనే డిసెంబర్ 1నుంచి "ఇదేం ఖర్మ"పేరిట మరో కార్యక్రమం చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి.. "ఇదేం కర్మ" ప్రచార వీడియోను విడుదల చేశారు. ఇంత దారుణమైన.. ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, అందుకే దీనికి" ఇదేం ఖర్మ" పేరు ఖరారు చేశామని చంద్రబాబు వివరించారు. మూడున్నరేళ్లలో.. ప్రజా స్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయని మండిపడ్డారు.
మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం: ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని పార్టీ అధినేత ప్రారంభించారు. జాతీయ భావాలతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం అని.. ప్రాంతీయ భావాలతోనే కాకుండా జాతీయ భావాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు అదే బాధ్యతగా ఉన్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో తెదేపా ఒక నమూనా అని .. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం అని తేల్చిచెప్పారు. మూడున్నరేళ్లుగా తెదేపాపై దాడులు చేస్తూనే ఉన్నారని.. రాత్రిళ్లు అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి దారుణ, నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"అధికార పార్టీకి చెందిన ఓ ఫ్లెక్సీ తగులబడితే పోలీసులను రంగంలోకి దింపారు. తునిలో తెదేపా నేత మీద హత్యాయత్నం జరిగితే ఆ పోలీసులు ఎక్కడున్నారు? నాపై పూలేస్తే ఆ పూలల్లో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ పూలల్లో రాళ్లున్నాయన్నారు.. రేపు అవే పూలల్లో బాంబు ఉందని అంటారా? నాపై రాళ్లేస్తే భయపడి పర్యటనలు మానుకుంటానని అనుకుంటున్నారా? అచ్చెన్నాయుడిని వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపింది. ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడటం లేదు. ఇవాళే కాదు.. రేపు అనేది కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం"-టీడీపీ అధినేత చంద్రబాబు