తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు నరసరావుపేటకు వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఇక్కడకు చేరుకోనున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా పట్టణంలో చంద్రబాబు పాదయాత్ర చేపడతారని ఆయన వివరించారు. పట్టణ తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం వైకాపా ప్రభుత్వ తీరుపై ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. దిశ చట్టం ఏర్పాటు చేసిన పోలీసులే రాజధాని ఉద్యమ మహిళలపై దాడులు చేస్తున్నారన్నారు. కేసులు పెట్టడం కోసం పోలీసులు చట్టాలు వాడుతున్నారు. అదే చట్టాలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మరో బిహార్‌లా మారిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నెలకొందని విమర్శించారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు. అధికారపార్టీ యాత్రలకు అనుమతులిస్తున్న పోలీసులు రాజధాని రైతులను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అనంతరం తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలన అప్పటి తుగ్లక్ పాలనను మించిపోయిందని విమర్శించారు.
నేడు నరసరావుపేటకు చంద్రబాబు - ఏపీలో రాజధానిపై ఆందోళనలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు చంద్రబాబు పర్యటించనున్నట్లు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రలో భాగంగా ఆయన ఇక్కడకు వస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Chandrababu will be coming to Narasaraopet on Sunday