జగన్కు ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియదు - రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి?: చంద్రబాబు Chandrababu Visit Michaung Cyclone Affected Areas:తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. మిగ్‌జాం తుపాను ప్రభావంతో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. అసాధారణ తుపానుతో రైతులు నష్టపోయి ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాలుగేళ్లుగా మురుగుకాల్వల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో పొలాల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నష్టం అంచనా వేయకపోవడం దారుణమన్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్లలో పర్యటించిన చంద్రబాబు రైతుల సమస్యలు వింటూ వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.
కలగానే పొట్టెపాళెం వంతెన నిర్మాణం - వర్షాలు కురిసినప్పుడల్లా ప్రజలకు తప్పని ఇబ్బందులు
ప్రభుత్వ వ్యవస్థలు విచ్ఛిన్నమై సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే ఇలాంటి విపత్తులే ఎదుర్కొవాల్సి వస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదూద్, తిత్లీ తుపానుల సమయంలో తెలుగుదేశం స్పందించిన తీరు ప్రస్తుత తుపాను నేపథ్యంలో జగన్ ప్రభుత్వ పనితీరుకు మధ్య తేడా గమనించాలని ప్రజలను, రైతులను చంద్రబాబు కోరారు. తుపాను హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని రైతులను అప్రమత్తం చేసి ఉంటే నష్టతీవ్రత తగ్గేదన్నారు. రైతులకు అండగా ఉంటానన్న చంద్రబాబు ప్రభుత్వం సాయం చేసే వరకు పోరాటం చేద్దామని అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
సీఎం జగన్ నిర్లక్ష్య ఫలితం - కొద్దిపాటి వర్షాలకే అతలాకుతలం అవుతున్న నగరాలు, పట్టణాలు
రేవేంద్రపాడు వద్ద మొదలైన చంద్రబాబు పర్యటన రాత్రి వరకు కొనసాగింది. ఉదయం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, తెనాలి మండలాల్లో పర్యటన సాగింది. మధ్యాహ్నం అమర్తలూరు, చెరుకుపల్లి, నగరం, కర్లపాలెం మీదుగా బాపట్ల చేరుకున్నారు. మార్గమధ్యలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన ఆసాంతం జనం పెద్ద ఎత్తున రావడంతో పర్యటన ఆలస్యంగా కొనసాగింది. తెనాలిలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. బాబుతోనే భవిష్యత్ అంటూ నినదించారు. వేమూరు నియోజకవర్గంలోకి నాలుగు గంటలు ఆలస్యంగా పర్యటన కొనసాగినప్పటికీ తమ అభిమాన నేతను పలకరించేందుకు జనం రోడ్లపైకి భారీగా తరలివచ్చారు. విపత్తు సమయంలో సాయం తగ్గించి జగన్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు సాయం పెంచాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లిలో మత్స్యకారుల వినూత్న నిరసన - ఆదుకోవాలంటూ జలదీక్ష
వరికి హెక్టారుకు 30వేలు, ఆక్వాకు 50వేలు, తుపాను ప్రభావంతో మరణించిన వారికి 10లక్షలు, గాయపడిన వారికి 2లక్షలు సాయం అందించాలన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి, తిరిగి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం- జనసేన ప్రభుత్వం తప్పకుండా సాయం చేస్తాయని ప్రకటించారు. ఆవేదన, బాధ ఉన్నా తిట్టాలంటే మనసు రావడం లేదన్న చంద్రబాబు జగన్ కాడి పడేశారని ఎద్దేవా చేశారు. మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఇవాళ బాపట్ల జిల్లాలోని పర్చూరు, పెదనందిపాడు, గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతుల్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.