Chandrababu Review with Party Leaders: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయడం ద్వారా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో మూడు స్థానాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలకు అలవాటు పడిన వైసీపీ.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అక్రమాలకు తెరతీసిందని మండిపడ్డారు. పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చడం, ఇతర ప్రాంతాల వారికీ ఈ ప్రాంతాల్లో ఓటు రాయించడం నీచమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగ ఓట్లపై చంద్రబాబు: దొంగ ఓట్లు చేర్పించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు.. తప్పుడు పత్రాలతో ఓట్లు పొంది ఓటు వేసే వాళ్లు కూడా శిక్షార్హులు అని పేర్కొన్నారు. బోగస్ ఓటర్లపై, వారిని చేర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోగస్ ఓట్లపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో పాటు.. కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఫిర్యాదులు చేయాలని నేతలకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. కొన్ని సందర్భాల్లో రెండో ప్రాధాన్య ఓటు కీలకంగా మారుతుందని, ఆ ఓటు టీడీపీ అభ్యర్థికే పడేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిల గెలుపు కోసం పని చేయాలని సూచించారు.