BABU COMMENTS : రానున్న ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు స్ఫష్టతనిచ్చారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటివరకు పొత్తుల గురించి నేనెక్కడా మాట్లాడలేదని.. పొత్తుల గురించి నాయకుల్లో స్పష్టత ఉండాలని పేర్కొన్నారు.కేంద్రం లేదా రాష్ట్రంలో రాష్ట్ర పునఃనిర్మాణం కోసం చేసే కార్యక్రమాలకే తమ ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. పోలీసులు లేకుండా వస్తే వైకాపానో, తెలుగుదేశం పార్టీనో తేల్చుకునేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్ విసిరారు. త్వరగా ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టి పీడ వదిలిపోతుందని.. నెత్తిన ఉన్న కుంపటిని ఎప్పుడు దించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి రూ.2లక్షల కోట్లు దాటిపోయిందని ఆరోపించారు.
అమాంతం పెరిగిన జగన్ ఆస్తులు : రాష్ట్రంలో జగన్ ఆస్తులు పెరిగి జనం జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతిని క్రమబద్ధీకరిస్తున్నారనటానికి లేపాక్షి భూముల వ్యవహారమే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదు కానీ వైకాపా నేతల ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిందని విమర్శించారు. సొంత సంస్థలకు ఇష్టానుసారం కేటాయింపులు, అనుమతులు ఇస్తున్నారని ఆక్షేపించారు. మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో విజన్ లేని విధ్వంసమే ఎక్కువని, ఒక్కో కుటుంబంపై రూ. 3.25లక్షల అదనపు ఆర్థిక భారం వేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేయటంతో ఏ సర్పంచ్ ఆనందంగా లేరని వాపోయారు.
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం పార్టీ పేరు చెప్తేనే వైకాపాలో వణుకు మొదలవుతోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో పోరాడేవారు తయారు కావాలని.. వారిని పార్టీలో ఉన్నపెద్ద మనుషులు తయారు చేయాలని సూచించారు. న్యాయబద్ధంగా, రాజకీయంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు "క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్" నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఠా రాజకీయలు, ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన ఘనత తెలుగుదేశానిదేనని గుర్తు చేశారు. వ్యవస్థలు నాశనం కావటంతో రాష్ట్రంలో వైకాపా నేతలకు కూడా భద్రత లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఇదే మాదిరిగా ఉంటే ప్రజలకు భవిష్యత్తు ఉండదన్నారు.
ఇకపై ఎన్నికల్లో తెదేపా పోటీ అనివార్యం : నేతలు ఎప్పటికప్పుడు ఓటర్ జాబితా పరిశీలించుకోకపోతే తెలుగుదేశం ఓట్లు తీసేసి.. వైకాపా నాయకులు దొంగ ఓట్లను చేరుస్తారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక నుంచి ఏ ఎన్నిక వచ్చినా తెదేపా పోటీ అనివార్యమని తేల్చిచెప్పారు. గెలుపే ధ్యేయంగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సమావేశం వేదికగా అభ్యర్థుల్ని ప్రకటించారు. పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌లను ఖరారు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నంకు త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. దిశ చట్టం, ప్రత్యేక పోలీసుస్టేషన్లంటూ నాటకాలాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించాలన్న ఆలోచన చేయట్లేదు. సరైన పౌష్టికాహారం లేక పిల్లలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రశ్నిస్తే సీఎం నుంచి సమాధానం రాదు పైగా ఎదురుదాడులు చేస్తారు. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా ఉండే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తులను ఆదుకునే కార్యక్రమాలు ఏంచేశారో సమాధానం చెప్పాలి. -చంద్రబాబు, తెలుగుదేశం అధినేత