ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు' - Chandrababu Naidu latest updates

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను ఆయన పరామర్శించారు. ధూళిపాళ్ల నరేంద్రకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

CBN Meet Dhulipalla
CBN Meet Dhulipalla

By

Published : Jul 13, 2021, 2:22 PM IST

Updated : Jul 14, 2021, 5:11 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

‘‘ప్రజలకు సేవ చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను రాజకీయకక్షతో అరెస్టు చేయడం చాలా అమానుషం. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇది అరాచకం, దుర్మార్గం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నా’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విలువలు లేని రాజకీయాలు చేసి, కక్షలకు పాల్పడితే రాష్ట్రం తగలబడిపోతుందన్నారు. సంగం డెయిరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో మంగళవారం చంద్రబాబు పరామర్శించారు. కుటుంబ సభ్యులు, డెయిరీ డైరెక్టర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కుటుంబం ఇక్కడి ప్రజలు, సంగం డెయిరీ రైతాంగానికి అండగా ఉందన్నారు. విలువలు లేని రాజకీయాలు చేస్తూ రాజకీయ కక్షలతో అరెస్టు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. 37 రోజులపాటు తనిఖీలు చేస్తూ ఆరాచకాలు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. సంగం, విశాఖ డెయిరీలు చట్టప్రకారం కంపెనీ చట్టంలోకి బదిలీ అయ్యాయి. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఆసుపత్రి పెట్టి పాడిరైతులకు సేవలు అందిస్తున్నారు. అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటివారు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అరెస్టులు చేస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాల కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానాలు చెబుతున్నా అరెస్టులు కొనసాగుతున్నాయన్నారు.

సర్పంచులకు తెదేపా వెన్నుదన్నుగా ఉంటుంది

సర్పంచుల అధికారాలను గ్రామ సచివాలయాలకు బదిలీ చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సచివాలయాలకు అధికారాలు ఇవ్వడానికి వీల్లేదని న్యాయస్థానాలు అక్షింతలు వేశాయని గుర్తుచేశారు. ‘సర్పంచులకు తెదేపా అండగా ఉంటుందన్నారు.

తెదేపా సీనియర్‌ నేత ఎం.డి. హిదాయత్‌ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. ఇటీవల కరోనా బారినపడి హిదాయత్‌ కన్నుమూశారు. గుంటూరు ఐపీడీ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి హిదాయత్‌ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘హిదాయత్‌ మృతి బాధాకరం. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మూడు పర్యాయాలు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారంటే అది హిదాయత్‌ నిజాయతీకి నిదర్శనం’ అన్నారు. ఇటీవల మృతి చెందిన తెదేపా సీనియర్‌ నాయకుడు నాగవరపు తిరుపతయ్య నివాసానికి చంద్రబాబు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీ-సేవల నిర్వాహకులు తమ సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, నాట్స్‌ పూర్వ అధ్యక్షుడు మన్నవ మోహన్‌కృష్ణ, కోవెలమూడి రవీంద్ర తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:

Minister Buggana: 'రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి.. అర్థరహిత విమర్శలొద్దు'

Last Updated : Jul 14, 2021, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details