ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో రైతులు దివాళా: చంద్రబాబు - chandra babu
వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండకట్టేందుకు కమిటీలను ఆయన ఏర్పాటు చేశారు.
![ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో రైతులు దివాళా: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4574209-470-4574209-1569607675440.jpg)
తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నీరు- చెట్టు బిల్లులను కక్షపూరితంగా నిలిపివేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 13 జిల్లాల ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్లు, నీటి సంఘాల నేతలతో ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తమ హయాంలో చేపట్టిన నీరు చెట్టు ద్వారా దాదాపు 90 టీఎంసీల నీటిని అందించి 7.30 లక్షల ఎకరాలకు అదనపు ఆయకట్టును అందించామని చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాల్లో 1,270 కోట్ల విలువైన చిన్న, సన్న కారు రైతులు చేసిన పనులకు కలెక్టర్ అగ్రిమెంట్లు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం కావాలనే బిల్లులు ఆపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అనాలోచిత చర్యలకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాళా తీస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండకట్టేందుకు ఈ సమావేశంలో కమిటీలను ఏర్పాటు చేశారు. దీనితో పాటు భారీ వర్షాలకు నష్టపోయిన గొర్రెల కాపరులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మేకలు, గొర్రెల పెంపకం దారుల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ వై.నాగేశ్వర యాదవ్, ఫెడరేషన్ 13 జిల్లాల ఛైర్మన్లు చంద్రబాబుని కలిసి వారి సమస్యలు వివరించారు.