Chandrababu Naidu key comments: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో సీఎం జగన్ ఇప్పుడు ఇక తప్పించుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ నిర్వహణ, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్‌తో పాటు పలు అంశాలపై నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు జీవో నెంబర్ 1 తేవడం, రాజకీయ పక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు తప్ప ముఖ్యమంత్రికి రాష్ట్రం గురించి పట్టడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కర్ణాటక రాష్ట్రం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని తెలిపారు. ఈ విషయంలో జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అడుగడుగునా రాజీ పడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీ ఎంపీలు పనిచేసేది సొంత లాబీయింగ్ కోసమే కానీ.. రాష్ట్రం కోసం కాదని దుయ్యబట్టారు.