పరిష్కారం చేతకాక ప్రతీ సమస్యను తెదేపా ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో తెదేపా ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా తెదేపా కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం, తెదేపా నాయకులపై కక్ష సాధించేందుకు.. సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆక్షేపించారు.
వైకాపా పతనం ఖాయం...
ప్రజావేదిక కూల్చివేతతోనే వైకాపా పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయానికి రోజూ వస్తున్న తనను అడ్డుకునేందుకు... పార్టీ ఆఫీసుకు నోటీసులు పంపే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వైకాపా చేస్తోన్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
పేదలను వేధింపులకు గురిచేసినా, దాడులు-దౌర్జన్యాలకు పాల్పడినా వారి పతనం తప్పదు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలోనూ ఫ్లెక్సీలతో ఘర్షణ వాతావరణం సృష్టించారు. ---చంద్రబాబు
రైతు సమస్యల పరిష్కారానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక కమిటీని నియమిస్తున్నామన్నారు. విత్తనాల కొరత, విద్యుత్ కోతలు, సాగునీటి కొరత, కరవు పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఆ కమిటీ సభ్యులు పర్యటిస్తారని వెల్లడించారు. ఆయా ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తారని తెలిపారు. పరిష్కార మార్గాలపై రాబోయే అసెంబ్లీ వేదికగా చర్చిస్తామన్నారు.