ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు.. ఎస్ఈసీకి చంద్రబాబు లేఖలు

Chandrababu wrote a letters to the SEC: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వరుసగా రెండు లేఖలు రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలపై ఎస్ఈసీకి చంద్రబాబు మొదటి లేఖ రాశారు. కౌంటింగ్ సెంటర్స్‌లో భద్రత పెంచడంతో పాటు నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని కోరారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్​లో వైసీపీ రౌడీల చొరబాటు ఘటనను ప్రస్తావించారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్​కు ఇతర ప్రాంతాల వ్యక్తుల తరలింపు, కౌంటింగ్ లో ప్రతి రౌండ్లో ఏజెంట్ సంతకం తీసుకునే అంశాలను రెండో లేఖలో పేర్కొన్నారు.

chandra babu
chandra babu

By

Published : Mar 17, 2023, 2:51 PM IST

Chandrababu letters to SEC: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వరుసగా రెండు లేఖలు రాశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలపై ఎస్ఈసీకి చంద్రబాబు మొదటి లేఖ రాశారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్​కు ఇతర ప్రాంతాల వ్యక్తుల తరలింపు, కౌంటింగ్​లో ప్రతి రౌండ్లో ఏజెంట్ సంతకం తీసుకునే అంశాలను రెండో లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికార వైసీపీ అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ మూకలు అక్రమ పద్ధతుల ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

కౌంటింగ్ సెంటర్​లోకి గూండాలు ప్రవేశించడమా?..: అనంతపురంలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు ప్రయత్నించారని పేర్కొన్నారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వైసీపీ గూండాలు ఎలాంటి పాసులు లేకుండా అక్రమంగా కౌంటింగ్ సెంటర్​లోకి వెళ్లి అలజడి సృష్టించారని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లపై దాడి చేసి కౌంటింగ్ స్టేషన్‌లో గందరగోళం సృష్టించారంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలాంటి పాసులు లేకుండా అక్రమంగా కౌంటింగ్ సెంటర్​లోకి ప్రవేశించిన రౌడీలను పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమని లేఖలో తెలిపారు. వైసీపీ గూండాలకు రక్షణగా నిలిచిన పోలీసులు.. టీడీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ ధనుంజయరెడ్డిని మాత్రం అరెస్టు చేశారంటూ లేఖలో చంద్రబాబు ఆక్షేపించారు.

ఓటమి ఖాయమనే వైసీపీ గూండాలతో దాడులు..:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడడానికి, వైసీపీ నేతలు కౌంటింగ్ స్టేషన్‌పై గూండాలను పంపించి దాడికి పాల్పడ్డారని తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​లో ఓటమి ఖాయమనే తేలిపోవడంతో.. ఆ భయం కారణంగానే అక్రమాలకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు వైసీపీ గూండాలకు ఇలాంటి అక్రమాలు అలవాటుగా మారాయని దుయ్యబట్టారు.

ఒత్తిడులకు లొంగుతున్న ఎన్నికల సిబ్బంది..: అధికార వైసీపీ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది చట్ట ప్రకారం విధులు నిర్వర్తించలేకపోతున్నారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో తక్షణమే భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలని కోరారు.

ధనంజయరెడ్డిని బేషరతుగా విడుదల చేయాలి..: టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ ధనుంజయరెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేసి.. కౌంటింగ్ హాల్​లో రభస సృష్టించిన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీసులను, స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించాలని చంద్రబాబు కోరారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్‌ చేశారు. ఎటువంటి పాసులు, గుర్తింపు కార్డులు లేకుండా కౌంటింగ్ స్టేషన్‌లో చొరబడిన వైసీపీ అనుచరుల వీడియోను చంద్రబాబు లేఖకు జత చేశారు.

కౌంటింగ్​లో ఏజెంట్ సంతకం తీసుకునే అంశాలపైమరోలేఖ..: పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్​కు ఇతర ప్రాంతాల వ్యక్తుల తరలింపు, కౌంటింగ్​లో ప్రతి రౌండ్లో ఏజెంట్ సంతకం తీసుకునే అంశాలను లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు.

ఇతర ప్రాంతాల వ్యక్తుల తరలింపుపై ప్రస్తావన..: అనంతపురంలోని కౌంటింగ్ సెంటర్​కు పులివెందులతో పాటు పలు ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ తమ సొంత పార్టీ కార్యకర్తలను తరలిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు, గూండాలు, బయట వ్యక్తుల ద్వారా కౌంటింగ్ సెంటర్ వద్ద అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న చంద్రబాబు.. వైసీపీ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి వస్తే వెంటనే గొడవలు సృష్టించి కౌంటింగ్​ను అడ్డుకోవాలనేది వారి పన్నాగమని చంద్రబాబు ఆరోపించారు.

కౌంటింగ్​ షీట్​లపై సంతకాలు తీసుకోవాలి..: తక్షణమే అదనపు భద్రతా బలగాలను మోహరించి కౌంటింగ్ సెంటర్ వద్ద తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఓట్ల లెక్కింపులో ప్రతి కౌంటింగ్ టేబుల్ స్థాయి నుంచి ఆర్వో టేబుల్ లెవెల్ వరకు కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు పొందడం లేదని తెలిసిందని పేర్కొన్నారు. దీనివల్ల తుది ఫలితాల ప్రకటనలో అవకతవకలకు అవకాశం ఉంటుందని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల అందరి నుంచీ ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ షీట్​లపై సంతకాలు తీసుకోవాలని కోరారు. తుది ఫలితాల్లో అవకతవకలను నివారించడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రధాన కౌంటింగ్ ఏజెంట్ల నుంచి ప్రతి రౌండ్‌లోనూ ధృవీకరణ సంతకాలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details